Telugu Global
Andhra Pradesh

నాకు టికెట్ రాదా..? అది శునకానందం

సీఎం జగన్ సర్వేల ద్వారా చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పనితీరు బాగాలేని వారిని మాత్రమే మారుస్తున్నారని వివరించారు. కచ్చితంగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు రోజా.

నాకు టికెట్ రాదా..? అది శునకానందం
X

మంత్రి రోజాకి ఈ దఫా నగరి వైసీపీ టికెట్ దక్కదు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె తొలిసారి స్పందించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె నగరి టికెట్ పై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అదంతా తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు. కొంతమంది శునకానందం పొందుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాదు అనుకోవడం అపోహ అని అన్నారు. కచ్చితంగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టంచేశారు రోజా.

జగనన్న సైనికురాలిని..

తాను జగనన్న సైనికురాలిని అని చెప్పారు మంత్రి రోజా. నగరిలో సీటు రోజాకు లేకపోతే అక్కడ రాధాకృష్ణ నిల్చుంటాడా..? లేక రామోజీరావు నిల్చుంటాడా..? అని ప్రశ్నించారామె. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక్కచోట నిలబడటానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్కొక్క‌రు రెండేసి సీట్లలో సర్వే చేయించుకుంటున్నారని అన్నారు. తాను ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టే రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రిని అయ్యానన్నారు. నగరి సీటు ఎవరికిచ్చినా తాను జగన్ అన్నకోసం ప్రాణం ఇస్తానన్నారు రోజా. తనకు సీటు లేదు అనేది కేవలం శునకానందం కోసం చేస్తున్న ప్రచారమేనన్నారు.

వైసీపీకి అభ్యర్థులను దూరం చేసి, వారిని టీడీపీకి మళ్ళించేద్దామని గోతికాడ గుంట నక్కలా ఎల్లో మీడియా కాచుకు కూర్చుందని కౌంటర్ ఇచ్చారు రోజా. అయినా సీఎం జగన్ సర్వేల ద్వారా చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పనితీరు బాగాలేని వారిని మాత్రమే మారుస్తున్నారని వివరించారు. మంత్రులకు అన్ని నియోజకవర్గాలపై పట్టు ఉంటుంది కాబట్టి.. కొంతమందిని పక్క నియోజకవర్గాలకు పంపించారన్నారు. కచ్చితంగా తాను మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు రోజా.

*

First Published:  19 Dec 2023 7:36 AM GMT
Next Story