Telugu Global
Andhra Pradesh

ఇది ఆడుదాం ఆంధ్రా.. హైదరాబాద్ లో ఓటు ఉన్నవారికి కాదు

ఆడుదాం ఆంధ్రాలో పొలిటికల్ డైలాగులు కూడా పేల్చారు మంత్రి రోజా. హైదరాబాద్‌ లో ఓటు పెట్టుకుని ఇక్కడ ఆడతాం అంటే కుదరదని పేర్కొన్నారామె.

ఇది ఆడుదాం ఆంధ్రా.. హైదరాబాద్ లో ఓటు ఉన్నవారికి కాదు
X

ఆడుదాం ఆంధ్రా అనే పేరుతో ఏపీ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రాష్ట్ర వ్యాప్త క్రీడా టోర్నమెంట్ల బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారామె. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో క్రీడలకోసం బడ్జెట్ కేటాయించలేదనన్నారు. విజేతలకిచ్చే బహుమతుల కోసమే 12కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు రోజా.

ఆడుదాం ఆంధ్రాలో పొలిటికల్ డైలాగులు కూడా పేల్చారు మంత్రి రోజా. హైదరాబాద్‌ లో ఓటు పెట్టుకుని ఇక్కడ ఆడతాం అంటే కుదరదని పేర్కొన్నారామె. కొంతమంది ఏపీలో రాజకీయాలు చేస్తూ, హైదరాబాద్ లో నివాసం ఉంటుంటారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో దొంగలా పారిపోయి వచ్చిన చంద్రబాబును ఎవరైనా ఏమని అడుగుతారన్నారు. కేవంల 72 గంటల్లోనే 7 లక్షలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆడుదాం ఆంధ్రా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు.

క్రీడలకు సీఎం జగన్ ప్రాధాన్యం..

ఏపీలో క్రీడా అకాడమీలు కట్టడం కోసం కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులకు ప్రభుత్వం భూమి ఇచ్చిందని చెప్పారు మంత్రి రోజా. ఆడుదాం ఆంధ్రాలో గెలిచిన వారికి ఏం చేయాలో స్పోర్ట్స్ కోటా విషయమై ఆలోచిస్తామన్నారు. సచివాలయ పరిధిలో మొదట క్రీడలు జరుగుతాయని, ఆ తర్వాత మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ఆటల పోటీలు జరుగుతాయన్నారు రోజా. ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు మంత్రి రోజా. ఆడపిల్లలు క్రీడల్లో రాణించాలని సూచించారు.

First Published:  1 Dec 2023 4:20 PM GMT
Next Story