Telugu Global
Andhra Pradesh

ఏం చేసిందో చెప్పుకునే స్థితిలో కూడా టీడీపీ లేదు

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ అజెండాలో భాగంగానే షర్మిల పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఏం చేసిందో చెప్పుకునే స్థితిలో కూడా టీడీపీ లేదు
X

తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల‌ పాల‌న‌లో రాష్ట్రానికి, ప్ర‌జ‌ల‌కు ఏం చేసిందో చెప్పుకొనే పరిస్థితిలో కూడా లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రస్తుతం ఆ పార్టీ పతనావస్థకు చేరిందన్నారు. రాజ్యసభలో టీడీపీ ఖాళీ అవుతోందని, దాని పతనావస్థకు ఇదే నిదర్శనమని పెద్దిరెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల 18న జరగనున్న వైసీపీ ‘సిద్ధం’ సభ ఏర్పాట్లను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

బాబు, పవన్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరం

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ అజెండాలో భాగంగానే షర్మిల పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. 2018కి ముందు ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్చిందని మంత్రి తెలిపారు. టీడీపీ దొంగ ఓట్లు నమోదు చేయడం వల్ల తాము కొన్ని స్థానాల్లో ఓడిపోయామని ఆయన చెప్పారు. వైఎస్‌ జగన్‌ అంటేనే నిజం అని.. ఖచ్చితంగా నిజం గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఏపీ రైతులకు జరిగిన మేలు గురించి తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే తెలుస్తుందన్నారు.

First Published:  13 Feb 2024 2:00 PM GMT
Next Story