Telugu Global
Andhra Pradesh

సభలో మేరుగ కుల ప్రస్తావనతో వివాదం

దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరకుంటారా అని ప్రశ్నించిన చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు సిగ్గులేదా అని మాత్రమే అన్నానని.. అందులో తప్పేంటని ప్రశ్నించారు. తానూ దళితుడినేనని సొంత కులస్తుడిని ఎందుకు అవమానిస్తానని చెప్పారు.

సభలో మేరుగ కుల ప్రస్తావనతో వివాదం
X

మంత్రి మేరుగ నాగార్జున తనను అవమానించారంటూ టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి అసెంబ్లీలో నిరసన తెలిపారు. మేరుగ నాగార్జునను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు. మేరుగ నాగార్జున మాట్లాడుతున్నసమయంలో బాలవీరాంజనేయులు ఫ్ల‌కార్డుతో ఆయన దగ్గరకు వెళ్లి నిలబడ్డారు. ఆ సమయంలో మంత్రి నాగార్జున.. దళితుడికే పుట్టావా?.. దళితుడికి పుట్టి ఉంటే చంద్రబాబు వద్ద పనిచేస్తావా? అంటూ ప్రశ్నించారు.

ఆ మాటలపై స్పీకర్‌కు టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై మంత్రి నాగార్జున తర్వాత సభలో వివరణ ఇచ్చారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరకుంటారా అని ప్రశ్నించిన చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు సిగ్గులేదా అని మాత్రమే అన్నానని.. అందులో తప్పేంటని ప్రశ్నించారు. తానూ దళితుడినేనని సొంత కులస్తుడిని ఎందుకు అవమానిస్తానని చెప్పారు. మంత్రి వివరణపై సంతృప్తి చెందని టీడీపీ ఎమ్మెల్యే... కనీసం క్షమాపణ కూడా మంత్రి చెప్పడం లేదని.. ఇలాంటి వ్యక్తిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

మధ్యలో జోక్యం చేసుకున్న మంత్రి అంబటి రాంబాబు.. జరిగిన దానికి తానే ప్రత్యక్ష సాక్షినని.. బాల వీరాంజనేయస్వామి ఫ్ల‌కార్డు తీసుకుని వచ్చి నాగార్జున ముందు నిలబడి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. ఆయన తీరు అభ్యంతరకరంగా ఉండడంతో పయ్యావుల కేశవే వచ్చి వెనక్కు తీసుకెళ్లారని అంబటి వివరించారు. అనంతరం తాను రికార్డు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తమ్మినేని హామీ ఇచ్చి తదుపరి చర్చలోకి వెళ్లారు.

First Published:  15 Sep 2022 9:10 AM GMT
Next Story