Telugu Global
Andhra Pradesh

తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొంటున్నాం.. మంత్రి కారుమూరి

రైతుల నుంచి భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా అధికారులను అలర్ట్ చేసినట్లు తెలిపారు.

తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొంటున్నాం.. మంత్రి కారుమూరి
X

ఏపీలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కార‌ణంగా ప‌లుచోట్ల చేతికొచ్చిన పంట దెబ్బతింది. కొందరు రైతులు ఇటీవల కోత కోసి ధాన్యాన్ని పొలాల్లో, రోడ్లపై ఆరబెట్టుకున్నారు. ఆ ధాన్యం కూడా వర్షానికి తడిచిపోయింది. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో తుపాను వల్ల రైతులు ఇబ్బంది పడకుండా వారి వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న రైతుల నుంచి భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా అధికారులను అలర్ట్ చేసినట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయడంతో పాటు గోనె సంచులు కూడా అందజేసినట్లు వివరించారు.

ఆఫ్ లైన్‌లో కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఆ పద్ధతిలో ఇప్పటికే లక్షా 7వేల బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రూ.1140 కోట్లకు గాను ఇప్పటికే రూ. 890 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. రైతులకు ఇంకా రూ. 200 కోట్లు అందజేయాల్సి ఉందని.. అది కూడా తొందరలోనే అందజేస్తామని చెప్పారు.

రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న ధాన్యానికి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే డబ్బు చెల్లిస్తున్నట్లు మంత్రి కారుమూరి వివరించారు. తేమ ఉన్న, రంగు మారిన ధాన్యం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

First Published:  5 Dec 2023 10:49 AM GMT
Next Story