Telugu Global
Andhra Pradesh

భార్యలు కాదు, భర్తలు బయటకు రావాలి.. యాత్రపై సంచలన వ్యాఖ్యలు..

అమరావతి రైతుల యాత్రపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. యాత్రల్లో మహిళలు పాల్గొంటున్నారని, వారికి బదులు వారి భర్తలు బయటకు వస్తే అసలు సంగతి బయటపడుతుందని అన్నారు.

భార్యలు కాదు, భర్తలు బయటకు రావాలి.. యాత్రపై సంచలన వ్యాఖ్యలు..
X

అమరావతి రైతుల యాత్ర ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఈ యాత్రను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అటు టీడీపీ నుంచి కూడా అంతే ఘాటుగా సమాధానాలు వస్తున్నాయి. తాజాగా ఈ యాత్రపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతి యాత్రల్లో మహిళలు పాల్గొంటున్నారని, వారికి బదులు వారి భర్తలు బయటకు వస్తే అసలు సంగతి బయటపడుతుందన్నారు.

గతంలో పాదయాత్రలో పాల్గొన్న ఓ మహిళ గుడివాడలో కారు ఎక్కి తొడగొట్టారు. అప్పట్లో ఆ ఎపిసోడ్ హైలెట్‌గా మారింది. ఆ తొడగొట్టిన మహిళపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. భర్తతో ఆమెకు ఉన్న విభేదాలు, ఆమె వ్యక్తిగత వ్యవహారాలపై రకరకాల ప్రచారాలు జరిగాయి. యాత్రలో పాల్గొంటున్న మహిళల రిస్ట్ వాచీలు ఖరీదైనవని, వారు వాడే యాపిల్ ఫోన్లు అంతకంటే ఖరీదైనవని, వారంతా బెంజి కార్లలో తిరిగేవారని కూడా విమర్శలు చేశారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు మరో అడుగు ముందుకేశారు. యాత్ర చేస్తున్న మహిళల భర్తలు బయటకు రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు వారి ముసుగు తొలగిపోతుందని చెప్పారు.

రైతుల ముసుగులో టీడీపీ నేతలు ఈ యాత్ర చేస్తున్నారని అన్నారు మంత్రి కారుమూరి. గోదావరి జిల్లాల్లో పాదయాత్రను స్వాగతిస్తోంది ప్రజలు కాదని.. టీడీపీ కార్యకర్తలని చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు బొమ్మ చూపించారని.. దౌర్జన్యంగా రైతుల భూములు స్వాధీనం చేసుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని, ఆ విషయం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు కారుమూరి.

First Published:  7 Oct 2022 2:29 PM GMT
Next Story