Telugu Global
Andhra Pradesh

అసెంబ్లీలో కూసే గాడిదలు, మేసే గాడిదలు..

ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చంద్రబాబు చేసుకుంటున్న విజయోత్సవాలు టీడీపీకి ఆఖరివి అంటూ సెటైర్లు వేశారు మంత్రి కాకాణి.

అసెంబ్లీలో కూసే గాడిదలు, మేసే గాడిదలు..
X

టీడీపీపై విమర్శలు చేసే క్రమంలో ఏపీ అసెంబ్లీలో కూసే గాడిదలు, మేసే గాడిదలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. చంద్రబాబు అసెంబ్లీకి రానంటున్నారని, సీఎం అయిన తర్వాతే వస్తానంటూ ఉన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ సభ్యుల పరిస్థితి కూసే గాడిదల్లా ఉందని, వారు అసెంబ్లీలోకి వచ్చి మేసే గాడిదలను కూడా చెడగొడుతున్నారని, మిగతా సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నారని, సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని చెప్పారు.

చివరి విజయోత్సవాలు..

ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చంద్రబాబు చేసుకుంటున్న విజయోత్సవాలు టీడీపీకి ఆఖరివి అంటూ సెటైర్లు వేశారు మంత్రి కాకాణి. ఇవే ఆయనకు ఆఖరి విజయోత్సవాలు, 2024 సార్వత్రిక ఎన్నికలే టీడీపీకి ఆఖరి ఎన్నికలంటూ కౌంటర్ ఇచ్చారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే పార్టీ గెలిచినట్లు చంద్రబాబు ఫీలవుతున్నారని చెప్పారు. టీడీపీకి తిరుగు లేదని ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు.

చంద్రబాబు పగటి కలలు కంటున్నారని, మోసాలు చేయటంలో‌ ఆయనకు గజకర్ణ, గోకర్ణ విద్యలు తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాకాణి. ప్రజల ప్రాణాలు కాపాడటానికే జీవో నెంబర్‌ -1 తీసుకొచ్చామని చెప్పారు. నిజంగానే జీవో నెంబర్-1 తో ప్రజల గొంతు నొక్కితే.. చంద్రబాబు గొంతు పెద్దది చేసుకుని అరవలేడు కదా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు అంటే చంద్రబాబుకి లెక్కే లేదన్నారు. వామపక్షాలది అస్తిత్వం కోసం ఆందోళన, చంద్రబాబుది ఓటమి ఆవేదన అని సెటైర్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనపడిన వారందరితో చంద్రబాబు పొత్తులు కుదుర్చుకుని బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కారన్నారు. ప్రాధాన్యతా ఓట్లతో గట్టెక్కిన టీడీపీ, ఈ విజయాలను సార్వత్రిక ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదన్నారు కాకాణి.

First Published:  20 March 2023 5:52 AM GMT
Next Story