Telugu Global
Andhra Pradesh

అమరావతి రాజధాని కాదు, ఓ గేటెడ్ కమ్యూనిటీ..

ఇంటికో ఉద్యోగం అంటూ అధికారంలోకి వచ్చిన బాబు, ఆ హామీ నెరవేర్చలేదు కాబట్టి.. అసెంబ్లీకి వచ్చి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని, తనకు ఓట్లు వేసిన ప్రజల తరపున సభకు హాజరు కావాలని అన్నారు మంత్రి కాకాణి.

అమరావతి రాజధాని కాదు, ఓ గేటెడ్ కమ్యూనిటీ..
X

అమరావతి రాజధాని కాదని, అది కేవలం చంద్రబాబు అండ్ కో.. కి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ అని అన్నారు మంత్రి కాకాణి గోవర్ద‌న్ రెడ్డి. అమరావతి రైతులుగా చెప్పుకుంటున్నవారు చేస్తున్న యాత్ర రాజధాని యాత్ర కాదని, చంద్రబాబు పాపాల యాత్ర అని వివరించారు. నారా హమారా, అమరావతి హమారా అంటూ నినాదాలు చేస్తున్నవారు దాన్ని ప్రజలందరి రాజధానిగా ఎలా చెబుతారని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి కొన్ని నెలల ముందే టీడీపీ నేతలు అక్కడ భూములు ఎందుకు కొన్నారని అడిగారు కాకాణి. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే మాట ముమ్మాటికీ వాస్తవం అని చెప్పారాయన.

బాబుకి సిగ్గుంటే అసెంబ్లీకి రావాలి..

చంద్రబాబుకు సిగ్గుంటే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు మంత్రి కాకాణి. ఉద్యోగాలివ్వలేదంటూ నిరసనలు తెలిపే హక్కు అసలు టీడీపీ నేతలకు లేదన్నారు. ఇంటికో ఉద్యోగం అంటూ అధికారంలోకి వచ్చిన బాబు, ఆ హామీ నెరవేర్చలేదు కాబట్టి.. అసెంబ్లీకి వచ్చి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని, తనకు ఓట్లు వేసిన ప్రజల తరఫున సభకు హాజరు కావాలని అన్నారు.

బాదిపడేస్తారు బాబూ..

బాదుడే బాదుడు అనే కార్యక్రమం ద్వారా టీడీపీ నేతలు జనాల్లోకి వస్తున్నారని, అయితే కేవలం ఫొటోలకు ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసుకోవ‌డానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారని చెప్పారు కాకాణి. నిజంగా ప్రతీ గడప తొక్కి సమ్యలున్నాయా అని అడిగితే చంద్రబాబుని, వారి నాయకుల్ని జనం బాదిపడేస్తారని అన్నారు.

టీడీపీ హయాంలో 10 మందికి ఇన్నోవా కార్లు, మరో 10మందికి లోన్లు ఇచ్చారని అది సంక్షేమం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు కాకాణి గోవర్ద‌న్ రెడ్డి. నీరు చెట్టు పథకం ద్వారా నిధులు భోజనం చేశారు కానీ పనులు జరగలేదని అన్నారు కాకాణి. టీడీపీకి అనుకూలమైనవారికి మాత్రమే వారి హయాంలో పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని, వైసీపీ హయాంలో అర్హులందరికీ లబ్ధి చేకూర్చామని చెప్పారు కాకాణి. టీడీపీకి ఈసారి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.

First Published:  17 Sep 2022 2:36 PM GMT
Next Story