Telugu Global
Andhra Pradesh

ఇప్పటంలో పిచ్చి కుక్క- డ్రామాలో పార్ట్-3

ఉట్టికి ఎగరలేని పవన్‌ కల్యాణ్.. ఇడుపులపాయ మీద హైవే వేస్తానంటూ కారుకూతులు కూస్తున్నారని మంత్రి మాట్లాడారు. ఇప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ముందు ఆ పని ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు.

ఇప్పటంలో పిచ్చి కుక్క- డ్రామాలో పార్ట్-3
X


పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. ఇప్పటం గ్రామానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. జనసేన వారి ఇళ్లను జగన్‌ ప్రభుత్వం కూల్చేసిందని.. తాము కూడా ఇడుపులపాయ ఎస్టేట్ మీదుగా హైవే వేసే రోజు వస్తుందని హెచ్చరించడంపై మంత్రి జోగి తీవ్రంగా స్పందించారు. అసలు గ్రామంలో ఒక్క ఇంటిని కూడా కూల్చలేదన్నారు. కేవలం ప్రహరీ గోడలను మాత్రమే కూల్చామన్నారు. ఈ కూల్చివేతల వల్ల గ్రామం అభివృద్ధి చెందుతుంది, భూమి విలువలు పెరుగుతాయని ప్రజలు సంతోషంగా ఉంటే పవన్ కల్యాణ్ మాత్రం ఒక కులానికి, ఒక పార్టీకి అన్యాయం జరిగినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.

గాంధీ విగ్రహాన్ని సురక్షితంగానే తొలగించామని, మరోసారి దాన్ని పక్కనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉట్టికి ఎగరలేని పవన్‌ కల్యాణ్.. ఇడుపులపాయ మీద హైవే వేస్తానంటూ కారుకూతులు కూస్తున్నారని మంత్రి మాట్లాడారు. ఇప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ముందు ఆ పని ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు.

250 కోట్లు సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర చేస్తున్నారని మాట్లాడుతున్నారని.. అసలు పవన్‌ మనుషులకు సిగ్గు ఉందా..? అని ప్రశ్నించారు. రెక్కీలేదు ఏమీ లేదని హైదరాబాద్ పోలీసులు చెప్పిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ అనే పిచ్చి కుక్క రెక్కీ అంటూ మాట్లాడుతున్నారని మంత్రి విరుచుకుపడ్డారు. తండ్రి హైదరాబాద్ వెళ్లగానే.. దత్తపుత్రుడు ఇక్కడ దిగిపోయారని ఎద్దేవా చేశారు. డ్రామాలో పార్ట్‌ -1 రెక్కీ, పార్ట్ -2 చంద్రబాబు కాన్వాయ్‌పై రాయి, పార్ట్-3 ఇప్పటంలో పిచ్చి కల్యాణ్‌ అని జోగి విమర్శించారు.

పవన్‌ కల్యాణ్- చంద్రబాబు కలిసి జగన్ ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదిలించలేరన్నారు. కళ్లుండి చూడలేని రామోజీరావు.. ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. గుళ్లను కూల్చిన చంద్రబాబుకు ఈ కూల్చివేత గురించి మాట్లాడే అర్హత ఉందా అని జోగి ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, రామోజీ అందరూ పూజకు పనికి రాని పువ్వులు అని విమర్శించారు.

First Published:  5 Nov 2022 9:19 AM GMT
Next Story