Telugu Global
Andhra Pradesh

జీతం డబ్బు, పొలం ఆదాయంతోనే భూములు కొన్నా- మంత్రి జయరాం

భూములతో మంజునాథ్‌కు ఎలాంటి సంబంధం లేదని.. తమకు తెలియకుండా భూములు అమ్మేశారని అది చెల్లుబాటు కాదని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ పాత్ర కూడా ఇందులో ఉందంటూ న్యాయస్థానానికి కూడా వెళ్లారు.

జీతం డబ్బు, పొలం ఆదాయంతోనే భూములు కొన్నా- మంత్రి జయరాం
X

వివాదాస్పద భూముల కొనుగోలు వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ నుంచి తనకు నోటీసులు అందినట్టు జరుగుతున్న ప్రచారంతో వాస్తవం లేదన్నారు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం. నోటీసులు వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

బెంగళూరుకు చెందిన ఇట్టినా ప్లాంటేషన్‌ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ కొన్నేళ్ల క్రితం కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలో రైతుల నుంచి 454 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఆ భూములను ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ మనుకు బంధువైన మంజునాథ్‌ పలువురికి విక్రయించారు. దాంతో డైరెక్టర్ మను పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.

భూములతో మంజునాథ్‌కు ఎలాంటి సంబంధం లేదని.. తమకు తెలియకుండా భూములు అమ్మేశారని అది చెల్లుబాటు కాదని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ పాత్ర కూడా ఇందులో ఉందంటూ న్యాయస్థానానికి కూడా వెళ్లారు. అలా మంజునాథ్‌ నుంచి భూములు కొన్న వారిలో మంత్రి గుమ్మనూరు జయరాం భార్య, ఇతర కుటుంబ సభ్యులున్నారు. 2020లో మంత్రి భార్య రేణుకమ్మ పేరున 30.8 ఎకరాల కొనుగోలు జరిగింది. అదే రోజు మంత్రి కుటుంబ సభ్యుల పేరున మరో 180 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఈ వ్యవహారంలోనే నోటీసులు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. తన భార్య పేరుతో భూములు కొన్న మాట వాస్తవమేనని ఇది వరకే మంత్రి అంగీకరించిన అంశాన్ని కూడా ఐటీ తన నోటీసుల్లో ప్రస్తావించినట్టు చెబుతున్నారు.

ఇలా వందల ఎకరాలు ఒకేరోజు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ఐటీ శాఖ ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంపై మరోసారి స్పందించిన మంత్రి జయరాం.. భూములను తన భార్య, సోదరుల పేరున కొనుగోలు చేసింది నిజమేనని చెప్పారు. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని, అంతా తన కుటుంబ సభ్యులేనని కాబట్టి బినామీల పేరుతో కొన్నామన్న ఆరోపణకు అవకాశమే లేదన్నారు.

భూములను చట్టబద్దంగానే కొనుగోలు చేశామని చెప్పారు. ఒకవేళ భూములు అమ్మే హక్కు మంజునాథ్‌కు లేకపోతే రిజిస్ట్రేషన్ అధికారులు ఎలా రిజస్ట్రేషన్ చేస్తారని మంత్రి ప్రశ్నించారు. ఉమ్మడి కుటుంబం కాబట్టి 100 ఎకరాల భూమి ఉందన్నారు. తమది వ్యవసాయ కుటుంబం అని.. పొలం ద్వారా వచ్చిన ఆదాయం, తన జీతం డబ్బులతో పాటు కొద్ది మొత్తం అప్పుగా తీసుకుని ఈ భూములను కొనుగోలు చేసినట్టు మంత్రి వివరించారు. ఎకరాకు లక్షన్నర చొప్పున చెల్లించి భూమి కొనుగోలు చేసినట్టు వివరించారు.

అయితే గుమ్మనూరు జయరాం ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఇట్టినా కంపెనీ నుంచి భూములను తిరిగి రైతులకు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయనే మంత్రి అయ్యాక వివాదాస్పద భూములను తక్కువ ధరకు తాను సొంతం చేసుకోవడంపై టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

First Published:  2 Dec 2022 3:09 AM GMT
Next Story