Telugu Global
Andhra Pradesh

సీటుపై క్లారిటీ.. మంత్రి గుడివాడ కీలక వ్యాఖ్యలు

"చాలా మంది నీ పరిస్థితి ఏంటి..? ఎక్కడ పోటీ చేస్తావని నన్ను అడుగుతున్నారు. నాకు 15 నియోజకవర్గాల భాద్యతను సీఎం జగన్ అప్పగించారు." అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

సీటుపై క్లారిటీ.. మంత్రి గుడివాడ కీలక వ్యాఖ్యలు
X

మంత్రి గుడివాడ అమర్నాథ్ కు తన సీటుపై క్లారిటీ వచ్చేసినట్టుంది. అందుకే ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 15 నియోజక వర్గాల బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారని, ఆ 15 నియోజక వర్గాల్లో వైసీపీని గెలిపించడమే తన తక్షణ కర్తవ్యం అని చెప్పారాయన. ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని అన్నారు మంత్రి.

గుడివాడ అమర్నాథ్ 2019లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జగన్ కేబినెట్ లో ప్రస్తుతం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల వైసీపీ జాబితాలో ఆయన పేరు మిస్ అయింది. అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ ను జగన్ ఇన్ చార్జ్ గా ప్రకటించారు. అదే సమయంలో మంత్రి గుడివాడకు మరో నియోజకవర్గాన్ని కేటాయించలేదు. ఇన్నాళ్లూ ఆయన తన సీటుపై జగన్ స్పందిస్తారేమోనని వేచి చూశారు. కానీ అటువైపు నుంచి సమాధానం లేకపోయే సరికి ఈరోజు జగన్ పాల్గొన్న సభలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ.

"చాలా మంది నీ పరిస్థితి ఏంటి..? ఎక్కడ పోటీ చేస్తావని నన్ను అడుగుతున్నారు. నాకు 15 నియోజకవర్గాల భాద్యతను సీఎం జగన్ అప్పగించారు. 15 నియోజకవర్గాలను గెలిపించి.. మళ్లీ జగన్‌ను సీఎం చేసుకుంటాము. అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటా. అందరి తలరాతలు దేవుడు రాస్తాడు, నా తలరాత జగన్ మోహన్ రెడ్డి రాస్తారు." అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

First Published:  7 March 2024 10:49 AM GMT
Next Story