Telugu Global
Andhra Pradesh

వారాహికి ఏపీలో బ్రేకులు వేస్తారా..? మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యల కలకలం

ఆ వాహనం తెలంగాణలో రిజిస్టర్ అయిందని తనకు తెలుసని, అది ఏపీలోకి వస్తే మన ఆర్టీఏ అధికారులు ఏం చెబుతారో చూడాలని అన్నారు మంత్రి అమర్నాథ్.

వారాహికి ఏపీలో బ్రేకులు వేస్తారా..? మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యల కలకలం
X

నిన్నటి వరకూ పవన్ కల్యాణ్ వారాహి వాహనం రిజిస్ట్రేషన్ గురించి గొడవ జరిగింది. వారం రోజుల క్రితమే ఆ తంతు పూర్తయిందని తెలిసే సరికి జనసేన నేతలు హడావిడి చేస్తున్నారు. అయితే తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. వారాహికి ఏపీలో బ్రేకులు పడతాయేమోననే అనుమానాలు మొదలయ్యాయి. అదేంటి తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు ఏపీలో అనుమతి లేదా అనే అనుమానం మీకు రావొచ్చు. కానీ మంత్రి అమర్నాథ్ మాత్రం ఏపీలోకి రానివ్వండి చూద్దామంటున్నారు.

అమెరికా చట్టాలు ఇక్కడ చెల్లుబాటవుతాయా..?

అమెరికాలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుందని, ఇండియాలో రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుందని, అక్కడి రూల్స్, ఇక్కడి రూల్స్ వేరు వేరుగా ఉంటాయని చెప్పారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అక్కడి రూల్స్ ఇక్కడ పనికిరావు కదా అని మీడియాని ప్రశ్నించారు. ఆ వాహనం తెలంగాణలో రిజిస్టర్ అయిందని తనకు తెలుసని, అది ఏపీలోకి వస్తే మన ఆర్టీఏ అధికారులు ఏం చెబుతారో చూడాలని అన్నారు.

అంటే ఆపేస్తారా.. ?

అది ఆలివ్ గ్రీన్ కాదు, ఎమరాల్డ్ గ్రీన్ అని తెలంగాణ ఆర్టీఏ అనుమతి ఇచ్చింది. మరి దీనిపై ఏపీలో ప్రభుత్వం ఏమైనా అభ్యంతరం తెలుపుతుందా... లేక అధికారులే అత్యుత్సాహంతో వాహనాన్ని అడ్డుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద.. ఆ వాహనం విషయంలో ఏదైనా జరిగే అవకాశముందని ముందుగానే మంత్రి అమర్నాథ్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఎలా ఆపుతారో చూస్తామంటూ జనసేన నేతలు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. అసలు ఆర్టీఏ రూల్స్ మంత్రిగారికి తెలుసా అంటూ మరికొందరు సెటైర్లు పేలుస్తున్నారు. వాహనం వస్తుంటేనే ఇంత వణికిపోతున్నారే, రేపు యాత్ర మొదలైతే ఇంకెంత భయపడతారోనని ఎద్దేవా చేస్తున్నారు జన సైనికులు.

First Published:  14 Dec 2022 2:53 AM GMT
Next Story