Telugu Global
Andhra Pradesh

మద్య నిషేధం చేస్తామని మా పార్టీ చెప్పలేదు : మంత్రి అమర్‌నాథ్

మంత్రి ఇచ్చిన వివరణకు అక్కడ ఉన్న విలేకరులు ఆశ్చర్యపోయారు. పాదయాత్రలో జగన్ మద్యనిషేధంపై స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేసినా.. మేనిఫెస్టోలో ఏమీ లేదని.. మంత్రి బల్లగుద్ది మరీ చెప్పారు.

మద్య నిషేధం చేస్తామని మా పార్టీ చెప్పలేదు : మంత్రి అమర్‌నాథ్
X

మద్యనిషేధం అమలు చేస్తామని వైసీపీ ఏనాడూ చెప్పలేదంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసి వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలనే కాకుండా, సొంత పార్టీ వారికి కూడా దిగ్భ్రాంతి కలిగించాయి. మద్య నిషేధంపై అమర్‌నాథ్ మీడియాకు ఇచ్చిన వివరణ వింతగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన మద్యం అమ్మకాలను తగ్గించి, మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని వైఎస్ జగన్ తన పాదయాత్రలో పలుమార్లు చెప్పారు. పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసి కేవలం 5 స్టార్ హోటల్స్‌కే పరిమితం చేస్తామని వైసీపీ తమ మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నది.

కానీ, శనివారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అసలు తమ పార్టీ మద్యాన్ని నిషేధిస్తామని ఏనాడూ చెప్పలేదని తేల్చేశారు. మద్యపానానికి సంబంధించి మా ప్రభుత్వం అసలు మాట తప్పలేదని వివరణ ఇచ్చారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలంన్నింటినీ నెరవేర్చాము.. మేము ఈ పని చేయలేదని మమ్మల్ని ప్రశ్నించండి మేం వివరణ ఇస్తామని మంత్రి అమర్‌నాథ్ విలేకరులకు సవాలు విసిరారు. మద్యనిషేధం అమలు చేస్తామని మాట తప్పారు కదా అని ప్రశ్నించగా.. మంత్రి వెంటనే.. అలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మద్యం ధరలు స్టార్ హోటల్స్ కంటే ఎక్కువ పెడతాం. ఎవరైనా మద్యం కొనుగోలు చేయాలంటే రేట్లకు భయపడేలా చేస్తామని మాత్రమే మేనిఫెస్టోలో చెప్పామని అన్నారు.

రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా మా మేనిఫెస్టో గోడలపై ఉంటుంది. కావాలంటే విలేకరులు వెళ్లి చెక్ చేసుకోవచ్చంటూ మంత్రి అమర్‌నాథ్ జవాబిచ్చారు. మంత్రి ఇచ్చిన వివరణకు అక్కడ ఉన్న విలేకరులు ఆశ్చర్యపోయారు. పాదయాత్రలో జగన్ మద్యనిషేధంపై స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేసినా.. మేనిఫెస్టోలో ఏమీ లేదని.. మంత్రి బల్లగుద్ది మరీ చెప్పారు.

మద్యం విక్రయాలపై ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు వారికి అస్త్రాలుగా మారే అవకాశం ఏర్పడింది. మద్యనిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి చెప్పినా బాగుండేదని.. అసలు ఆ హామీనే ఇవ్వలేదని చెప్పడం పార్టీకి మైనస్‌గా మారుతుందని కొంత మంది సొంత పార్టీ నాయకులే అంటున్నారు.

First Published:  30 July 2022 2:04 PM GMT
Next Story