Telugu Global
Andhra Pradesh

రెండు నెలల్లో విశాఖ కేంద్రంగా పాలన

రెండోరోజు ఇన్ఫినిటి వైజాగ్ సదస్సులో పాల్గొన్న మంత్రి అమర్నాథ్.. మరో రెండు నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతోందని, ఏదేమైనా ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

రెండు నెలల్లో విశాఖ కేంద్రంగా పాలన
X

మూడురాజధానుల విషయంలో కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎందుకో కాస్త నెమ్మదించారు. గత అసెంబ్లీ సెషన్లో కొత్తగా మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెడతారని అనుకున్నా అది సాధ్యం కాలేదు.


ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లుని తెరపైకి తెచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే మూడు రాజధానుల అంశమే ప్రధాన అజెండాగా జగన్ 2024 ఎన్నికల రణక్షేత్రంలో దిగే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. ఈ దశలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ పాలనా రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ కేంద్రంగా పాలన మొదలవుతుందని చెప్పారాయన.

రెండోరోజు ఇన్ఫినిటి వైజాగ్ సదస్సులో పాల్గొన్న మంత్రి అమర్నాథ్.. మరో రెండు నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతోందని, ఏదేమైనా ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. త్వరలో ఇన్ఫోసిస్‌ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదో స్థానంలో ఉందని, త్వరలో అదాని డేటా సెంటర్‌ ను కూడా ప్రారంభిస్తామన్నారు. విశాఖను ఐటీ హబ్‌ చేయడమే తమ లక్ష్యం అని చెప్పారు.

ఫిబ్రవరి చివరి వారంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.. మార్చి నెలలో విశాఖ వేదికగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగాల్సి ఉంది. ఆలోగా రాజధానిపై కీలక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.


అయితే అధిష్టానం ఆదేశాల మేరకే ఐటీ మంత్రి ఇలా పాలనా రాజధానిపై హింట్ ఇచ్చారా, లేక ఫ్లోలో రెండు నెలల్లో అని అనేశారా.. తేలాల్సి ఉంది. నిజంగానే సీఎం జగన్, మంత్రులకు ఈ విషయాలన్నీ చేరవేస్తుంటే.. ఉత్తరాంధ్ర నుంచి పదే పదే రాజధానికోసం మంత్రి ధర్మాన అంత హడావిడి చేసేవారు కాదనే వాదన కూడా వినపడుతోంది. మొత్తమ్మీద మంత్రులు తమ మనసులో మాట చెప్పేశారు, ఇక జగన్ మనసులో ఏముందు వేచి చూడాలి.

First Published:  21 Jan 2023 11:10 AM GMT
Next Story