Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి సవాల్ విసిరిన మంత్రి అమర్నాథ్.. పనిలో పనిగా నారా లోకేష్‌కీ ఎర్త్!

చంద్రబాబు తనపై చేసిన భూమి ఆక్రమణ ఆరోపణల్ని వెంటనే నిరూపించాలని డిమాండ్ చేసిన అమర్నాథ్.. ఒకవేళ నిరూపించలేకపోతే నారా లోకేష్‌ను రాజకీయాలు నుంచి తప్పిస్తావా? అంటూ చంద్రబాబుకి ఓపెన్ సవాల్ విసిరారు.

చంద్రబాబుకి సవాల్ విసిరిన మంత్రి అమర్నాథ్.. పనిలో పనిగా నారా లోకేష్‌కీ ఎర్త్!
X

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన భూమి ఆక్రమణ ఆరోపణలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. విస్సన్నపేటలో 609 ఎకరాలను అమర్నాథ్ అక్రమంగా కాజేసినట్లు చంద్రబాబు ఆరోపించారు. దాంతో ఆ ఆరోపణలపై స్పందించిన గుడివాడ అమర్నాథ్.. ఆ 609 ఎకరాలలో కనీసం ఒక సెంటు భూమి తన పేరు మీద లేదా తన కుటుంబ సభ్యుల పేరుమీద ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. అంతేకాదు.. తాను తప్పు చేయాల్సి వస్తే రోడ్డు మీద ఉరివేసుకుంటానని కూడా ఎమోషనల్‌గా బదులిచ్చారు.

చంద్రబాబు తనపై చేసిన ఈ భూమి ఆక్రమణ ఆరోపణల్ని వెంటనే నిరూపించాలని డిమాండ్ చేసిన అమర్నాథ్.. ఒకవేళ నిరూపించలేకపోతే నారా లోకేష్‌ను రాజకీయాలు నుంచి తప్పిస్తావా? అంటూ చంద్రబాబుకి ఓపెన్ సవాల్ విసిరారు. ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకి తెరతీశారని ఎద్దేవా చేసిన అమర్నాథ్.. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసే విష‌యం గుర్తుకు రాదని సెటైర్ వేశారు. అధికారం కోల్పోతే మాత్రం ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు.

విశాఖపై చంద్రబాబు ఎందుకు తరచూ విషం చిమ్ముతున్నారని సూటిగా ప్రశ్నించిన గుడివాడ అమర్నాథ్.. ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేస్తే చంద్రబాబు అప్పట్లో భోగాలు అనుభవించారని చెప్పుకొచ్చారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా షుగర్ ఫ్యాక్టరీ‌లను మూయించిన చంద్రబాబుకి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని అమర్నాథ్ అసహనం వ్యక్తం చేశారు.

First Published:  20 May 2023 12:42 PM GMT
Next Story