Telugu Global
Andhra Pradesh

జేపీకి నిరసన సెగ.. అదో డార్క్ రూమ్ లీడర్ల చర్చా వేదికన్న మంత్రి

జయప్రకాశ్ నారాయణ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యంత కీలకమైన విశాఖ స్టీల్ గురించి మాత్రం మాట్లాడలేదు. దాంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అధ్యక్షుడు ఆదినారాయణ, కో కన్వీనర్ అయోధ్యరామ్‌ తమ నిరసన తెలిపారు.

జేపీకి నిరసన సెగ.. అదో డార్క్ రూమ్ లీడర్ల చర్చా వేదికన్న మంత్రి
X

విశాఖలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో" ఉత్తరాంధ్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? "అన్న అంశంపై జరిగిన సమావేశంపై అధికార పార్టీ విమర్శలకు దిగింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కన్వీనర్ గా ఉన్న ఈ చర్చా వేదిక నిర్వహించిన మీటింగ్ కు లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, సిపిఐ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రను చిన్నచూపు చూస్తున్నాయని నేతలు విమర్శించారు. అన్ని వనరులు ఉన్నప్పటికీ పాలకుల కారణంగానే ఉత్తరాంధ్ర ఇప్పటికీ వెనుకబడి ఉందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో సారవంతమైన భూములు, కావాల్సిన వర్షపాతం, సముద్రం వంటి సహజ వనరులు ఉన్న సరైన ప్రణాళిక లేని కారణంగానే ఈ ప్రాంతం వెనుకబడి ఉందని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ బోర్డ్ ఏర్పాటు చేయాలని, వలసలు లేకుండా చూడాలని, అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచాలని ఆయన సూచించారు. ప్రభుత్వాలు దివాలా స్థితిలో ఉన్నాయని అభివృద్ధి లేదు.. అంతా డ్రామా మాత్రమే నడుస్తోందని జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. ఈ పరిస్థితికి ప్రజలు కూడా కారణమేనన్నారు. జయప్రకాశ్ నారాయణ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యంత కీలకమైన విశాఖ స్టీల్ గురించి మాత్రం మాట్లాడలేదు. దాంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అధ్యక్షుడు ఆదినారాయణ, కో కన్వీనర్ అయోధ్యరామ్‌ తమ నిరసన తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి అత్యంత కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంటే ఆ అంశంపై జయప్రకాశ్ నారాయణ మాట్లాడకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. అందుకు జయప్రకాష్ నారాయణ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

"మీలో చాలామంది పుట్టకముందు నుంచే నాకు విశాఖ ఉక్కు కర్మాగారంపై అవగాహన ఉంది. చప్పట్లకు, వివాదాలకు నేను లొంగను. సంఘటిత వర్గాలు గొంతు చించుకున్నంత మాత్రాన నిజం లేని అంశాన్ని వాస్తవమని తాను అంగీకరించబోను" అన్నారు. విశాఖ ఉక్కు పై మరో వేదిక మీద చర్చిద్దాం అంటూ జేపీ దాటవేశారు.

ఈ చర్చా వేదికలో తెలుగుదేశం పార్టీ, వామపక్షాలకు చెందిన నాయకులు ఏపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికి మరో ఉద్యమం రావాల్సి ఉందన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో 90 శాతం ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉంటే ఇక అక్కడ విద్య బోధన ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పెద్ద పెద్ద భవంతుల వద్ద ఎక్కడ చూసినా వాచ్ మెన్లుగా ఉత్తరాంధ్ర వారే ఉంటున్నారని, వారిని ఇంకా కూడా అలాగే ఉంచవద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అందరూ మద్దతుగా నిలవాలని కోరారు.

అయితే ఈ సమావేశంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు అదో కోల్డ్ స్టోరేజ్ లీడర్ల చర్చా వేదికని ఉత్తరాంధ్ర చర్చ వేదికను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో పదవులు అనుభవించి ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్ లో, డార్క్ రూమ్ ల్లో ఉంటున్న నాయకులంతా ఒకచోటకు చేరి చర్చా వేదిక పేరుతో తెలుగుదేశం పార్టీ గొంతును వినిపిస్తున్నారని ఆరోపించారు. తొలుత విశాఖ పరిపాలన రాజధానికి మద్దతుగా తీర్మానం చేసి మిగిలిన అంశాలపై చర్చించాల్సింది పోయి, అదేమీ లేకుండా తెలుగుదేశం పార్టీ మార్గదర్శకత్వంలో వైసీపీని టార్గెట్ చేసేందుకు నేతలు ప్రయత్నించారని మంత్రి వ్యాఖ్యానించారు.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన కొణతాల రామకృష్ణ ఈ చర్చా వేదికకు అధ్యక్షత వహించడమే అందుకు నిదర్శనం అన్నారు. సిపిఐ రామకృష్ణ తమ పార్టీ పేరును "చంద్రబాబు ఆఫ్ ఇండియా" గా మార్చుకోవాలన్నారు. టిడిపితో సహజీవనం సాగిస్తున్న నాదెండ్ల మనోహర్, ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రుద్రరాజులు రాజకీయ మేధావులు అవుతారా? అని ప్రశ్నించారు .

తాగుబోతు అయ్యన్నపాత్రుడికి వయసు మీద పడి అరగంట మాట్లాడిన తర్వాత కళ్ళల్లో నీళ్లు వస్తే అది భావోద్వేగమని పచ్చ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. మార్చి 31 తర్వాత ఏ క్షణం నుంచైనా విశాఖ వేదికగా పరిపాలన ప్రారంభమవుతుందని కూడా మంత్రి చెప్పారు.

Next Story