Telugu Global
Andhra Pradesh

రాజధానిపై మరోసారి ధర్మాన సంచలన వ్యాఖ్యలు..

ఇదే రాజధాని అంటూ ఆల్రడీ విశాఖ గర్జించేసింది. కానీ అమరావతిలో ఉన్న హైకోర్టుని కర్నూలుకి తీసుకొచ్చి, సచివాలయాన్ని విశాఖకు తరలిస్తే.. మధ్యలో తిరుపతి చంకలు గుద్దుకోవడమే ఇక్కడ విచిత్రం.

రాజధానిపై మరోసారి ధర్మాన సంచలన వ్యాఖ్యలు..
X

ఏపీకి మూడు రాజధానులు అనేది వైసీపీ సిద్ధాంతం. మూడు రాజధానుల్లో సచివాలయం విశాఖలోనే అంటున్నారు కాబట్టి, దాన్ని పాలనా రాజధాని అనుకోవాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్నంత మాత్రాన అదేమీ ప్రధాన రాజధాని కాదు అనే సంకేతాలు ఆల్రడీ వచ్చేశాయి. ఇక ఏపీకి రాజధాని ఏది అంటే విశాఖ ఒక్కటే అని చెప్పుకోవాలని తాజాగా సెలవిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. పేరుకు మూడు రాజధానులు అని చెప్పినా.. పాలన అంతా విశాఖ నుంచే సాగుతుందని ఆయన వివరించారు. మన విశాఖ – మన రాజధాని పేరిట శ్రీకాకుళంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన రాజధానిపై మరోసారి సంచల‌న వ్యాఖ్యలు చేశారు.

ఎవర్ని రెచ్చగొట్టాలని..?

151 సీట్ల వైసీపీ మూడు కాకపోతే ఆరు రాజధానులు ఏర్పాటు చేసుకోవచ్చు. శాసన సభతోపాటు, ఇప్పుడు మండలిలో కూడా అడిగేవారు లేరు. కానీ పదే పదే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి స్టేట్ మెంట్లు ఎందుకిస్తున్నారో అర్థం కావడంలేదు. మూడు రాజధానుల గురించి ఎవర్ని రెచ్చగొట్టాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు రాజధానులకు అడ్డుపడితే సహించేది లేదు, భరించేది లేదంటున్నవారు.. అసలు ఎవరు అడ్డుపడుతున్నారో, ఎలా అడ్డుపడుతున్నారో చెప్పలేక పోతున్నారు. పాదయాత్రలో పాల్గొనే 600మంది అమరావతి రైతులకు మూడు రాజధానుల్ని అడ్డుకునే శక్తి లేదు. సరిగ్గా లెక్క తీస్తే 19మంది ఎమ్మెల్యేల బలమున్న టీడీపీకి అంత సీన్ అసలే లేదు. జీరో సీట్ల జనసేన, బీజేపీ ఏం చేసుకున్నా మూడు రాజధానుల్ని ఆపలేవు. ఈ దశలో మూడు రాజధానులపై వైసీపీ మీనమేషాలు లెక్కపెట్టడం దేనికి.. ? ఉత్తరాంధ్ర మంత్రులంతా రాజీనామాలు చేస్తామంటూ సవాళ్లు విసరడం ఎవరి మెప్పు పొందడానికి..?

రాయలసీమకు జరిగే న్యాయమేంటి..?

మూడు రాజధానులతో సీమకు న్యాయం జరుగుతుందని అంటున్నవారంతా ధర్మాన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి. విశాఖపట్నమే అసలు రాజధాని అంటున్నారు ధర్మాన. మరి కర్నూలులో హైకోర్టు కడితే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందో సీమ మేధావులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే రాజధాని అంటూ ఆల్రడీ విశాఖ గర్జించేసింది. కానీ అమరావతిలో ఉన్న హైకోర్టుని కర్నూలుకి తీసుకొచ్చి, సచివాలయాన్ని విశాఖకు తరలిస్తే.. మధ్యలో తిరుపతి చంకలు గుద్దుకోవడమే ఇక్కడ విచిత్రం. విశాఖే అసలైన రాజధాని అంటూ ఇన్నాళ్లకైనా వైసీపీ ఓ స్థిర నిర్ణయానికి రావడం మాత్రం సంతోషం. అయితే జై విశాఖ కేవలం ధర్మాన నినాదమేనా.. లేక జగన్నినాదం కూడానా..? తేలాల్సి ఉంది.

First Published:  31 Oct 2022 3:24 PM GMT
Next Story