Telugu Global
Andhra Pradesh

కర్నూలుకి హైకోర్టు.. మంత్రి వ్యాఖ్యల మర్మమేంటి..?

కర్నూలులో జ్యుడీషియల్ సిటీ నిర్మించబోతున్నామని, అందులో హైకోర్టు, నేషనల్ లా యూనివర్శిటీ, జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆర్థిక మంత్రి బుగ్గన. సెప్టెంబర్ లో నేషనల్‌ లా యూనివర్శిటీ నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

కర్నూలుకి హైకోర్టు.. మంత్రి వ్యాఖ్యల మర్మమేంటి..?
X

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారాన్ని ప్రజలు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. మహూర్తాలు, డెడ్ లైన్లు, కోర్టు కేసులు, ప్రతిపక్షాల విమర్శలు, కాపురం ఖాయమంటూ ముఖ్యమంత్రి స్టేట్ మెంట్లు.. వీటన్నిటితో అసలు ఏం నమ్మాలో, ఎవర్ని నమ్మాలో కూడా ప్రజలు తేల్చుకోలేని పరిస్థితి. తాజాగా కర్నూలు హైకోర్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కర్నూలులో జ్యుడీషియల్ సిటీ నిర్మించబోతున్నామని, అందులో హైకోర్టు, నేషనల్ లా యూనివర్శిటీ, జ్యుడీషియల్ అకాడమీ, వివిధ ట్రిబ్యునళ్ల కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

కర్నూలుకి హైకోర్టు..

ఈ స్టేట్ మెంట్ అర్థమేంటో ఊహించడం కష్టం. అంటే కర్నూలుకి హైకోర్టు తరలించారా..? తరలిస్తున్నారా..? భవిష్యత్తులో తరలించబోతున్నారా..? ఇది ప్రజల ఊహకే వదిలేసింది ప్రభుత్వం. కేంద్రం మాకు సంబంధం లేదంటోంది. రాష్ట్ర హైకోర్టు అనుమతి మేరకు నడచుకోవాలని సూచిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అడుగు ముందుకేసే పరిస్థితి లేదు. పాలనా రాజధాని విషయంలోనే నానా తంటాలు పడుతున్న ఈ సందర్భంలో అమరావతి నుంచి హైకోర్టు తరలింపుకి ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యమివ్వడంలేదు. రాగా పోగా.. స్థానిక మంత్రులు, నేతలు మాత్రం కర్నూలు న్యాయరాజధాని అనే స్టేట్ మెంట్లతో హడావిడి చేస్తుంటారు. తాజాగా బుగ్గన వ్యాఖ్యలు కూడా ఈ కోవలోనివే.

కర్నూలులోని జగన్నాథగట్టులో 250 ఎకరాలలో ప్రభుత్వం జ్యుడీషియల్‌ సిటీ నిర్మించబోతున్నట్టు తెలిపారు ఆర్థిక మంత్రి బుగ్గన. సెప్టెంబర్ లో నేషనల్‌ లా యూనివర్శిటీ నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. హైకోర్టు కూడా అక్కడే ఏర్పాటు చేస్తామన్నారు కానీ.. దానికి సంబంధించిన పురోగతి వివరించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల లోపు విశాఖ విషయంలో కీలక ముందడుగు పడే అవకాశం ఉంది కానీ, కర్నూలుకి హైకోర్టు అనేది మాత్రం సుదూర స్వప్నంగా భావించాల్సిందే.

First Published:  23 Aug 2023 12:42 AM GMT
Next Story