Telugu Global
Andhra Pradesh

ఆర్థిక మంత్రి అప్పులు చేయక హోం మంత్రి చేస్తారా..?

తాను అప్పుల మంత్రయితే, యనమల పెద్ద అప్పుల మంత్రా..? అని అడిగారు బుగ్గన. ఆర్థికమంత్రిగా తాను అప్పులు చేస్తానని, మరి పాల వ్యాపారం చేసుకుంటోన్న చంద్రబాబును పాల నాయుడు అని పిలవాలా? అని ప్రశ్నించారు.

ఆర్థిక మంత్రి అప్పులు చేయక హోం మంత్రి చేస్తారా..?
X

పిట్టకథల బుగ్గన అంటూ ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో కూడా బుగ్గనను అప్పులమంత్రి అంటూ విమర్శించారు. ఈ కామెంట్లకు ఆర్థిక మంత్రికి కోపమొచ్చింది. అసలు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని ఎలా నడపాలంటూ ప్రశ్నించారాయన. ఏపీ ఒక్కటే అప్పులు చేస్తుందా మిగతా రాష్ట్రాలు చేయడం లేదా అని అడిగారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉందని, అప్పులతోనే పాలన సాగాల్సి వస్తోందని వివరించారు.

నేనుకాక ఇంకెవరు చేస్తారు..?

అప్పులు చేసినా, ఆర్థిక సంస్కరణలు తెచ్చినా ఆర్థిక మంత్రే చేయాలని, హోంమంత్రి రాష్ట్రం కోసం అప్పులు చేస్తారా అని ప్రశ్నించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తాను అప్పుల మంత్రయితే, యనమల పెద్ద అప్పుల మంత్రా..? అని అడిగారు. ఆర్థికమంత్రిగా తాను అప్పులు చేస్తానని, మరి పాల వ్యాపారం చేసుకుంటోన్న చంద్రబాబును పాల నాయుడు అని పిలవాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు రౌడీ షీటర్‌ లాగా మాట్లాడుతున్నారని, తన ఇంటిని, జీవితాన్ని కూలుస్తానని చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. సొంత మామ, బావ మరిది జీవితాలనే చంద్రబాబు కూల్చారని అన్నారు.

వందేళ్ల క్రితం తన ఊళ్లో కట్టిన ఇంట్లోనే తానింకా ఉంటున్నానని, కానీ చంద్రబాబు అసలు నారావారి పల్లెలో ఉంటున్నారా అని ప్రశ్నించారు బుగ్గన. ఏడాదికోసారి తన తల్లిని చూసేందుకు వెళ్లినా, చంద్రబాబు ప్రచారం చేసుకుంటారని చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 34 వేల ఉద్యోగాలు ఇస్తే, జగన్ హయాంలో తాము లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించామన్నారు. అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబుతో పోలిస్తే తాము తక్కువ అప్పులే చేశామని వెల్లడించారు. గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానంటున్న చంద్రబాబు, 2019లో ఓడిన తర్వాత కూడా ఇంకా రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు.

First Published:  17 Nov 2022 3:07 PM GMT
Next Story