Telugu Global
Andhra Pradesh

చర్చలకు రాకపోతే నిర్ణయాన్ని నేరుగా ప్రకటిస్తాం- బొత్స

సాయంత్రం నాలుగు గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలున్నాయని.. ఒకవేళ వారు చర్చలకు రాకపోతే ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.

చర్చలకు రాకపోతే నిర్ణయాన్ని నేరుగా ప్రకటిస్తాం- బొత్స
X

సీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పింఛ‌న్ స్కీం తీసుకురావడం సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి తేల్చిచెప్పారు. సీపీఎస్‌లోని అంశాల‌ వల్ల ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అధికారంలోకి వస్తే పాత‌ విధానాన్ని తెస్తామని జగన్‌ చెప్పింది నిజమేనన్నారు. కానీ అనంతరం దానిపై పరిశీలన చేయగా.. సీపీఎస్‌ రద్దు చేసి పాత విధానానికి వెళ్తే అనేక ఆర్థిక ఇబ్బందులు, కేంద్రం నుంచి అభ్యంతరాలు వస్తాయన్న అభిప్రాయానికి వచ్చామన్నారు. అందుకే మధ్యేమార్గంగా సమస్య పరిష్కారానికి జీపీఎస్ ప్రతిపాదిస్తున్నామన్నారు.

ఓపీఎస్‌ సాధ్యం కాదని చర్చల ప్రారంభంలోనే ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. ఉద్యోగ సంఘాలు చర్చలను బహిష్కరిస్తే.. అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేరుగా ప్రకటించడం తప్ప మరో మార్గం లేదన్నారు. చర్చలకు రానప్పుడు తామేమీ చేయగలమని ప్రశ్నించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలున్నాయని.. ఒకవేళ వారు చర్చలకు రాకపోతే ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.

పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు తమను కలిశారని, అయితే అవన్నీ అధికారికంగా జరిగినవి కావని, కేవలం సబ్జెక్ట్‌ తెలుసుకునేందుకు, అభిప్రాయాలు పంచుకునేందుకు మాత్రమే భేటీలు జరిగాయ‌న్నారు. ఈరోజు జరిగే చర్చలే అధికారికమైనవి అన్నారు. ఒకవేళ చర్చలకు సంఘాల నేతలు రాకపోతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు బొత్స.

First Published:  7 Sep 2022 10:14 AM GMT
Next Story