Telugu Global
Andhra Pradesh

విడాకుల వ్యవహారంపై మంత్రి బొత్స రియాక్షన్..

గతంలో మీరూ పెళ్లిళ్లు చేసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చిన పవన్, ఇప్పుడు మీ భార్యలకి విడాకులిచ్చేయండి, కొత్తగా మళ్లీ పెళ్లి చేసుకోండి అంటూ కాస్త ఘాటుగా బదులిస్తున్నారు. దీనికి వైసీపీ నేతలు ఫీలవుతున్నట్టున్నారు.

విడాకుల వ్యవహారంపై మంత్రి బొత్స రియాక్షన్..
X

మూడు రాజధానుల వ్యవహారం కాస్తా ఇప్పుడు పవన్ మూడు పెళ్లిళ్ల మీద‌కు మళ్లింది. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు కానీ, ఏపీకి మూడు రాజధానులు ఉండకూడదా అంటూ వైసీపీ నేతలు లాజిక్ తీస్తున్నారు. దీనికి పవన్ నుంచి ఊహించని రియాక్షన్ వచ్చింది. గతంలో మీరూ పెళ్లిళ్లు చేసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చిన పవన్, ఇప్పుడు మీ భార్యలకి విడాకులిచ్చేయండి, కొత్తగా మళ్లీ పెళ్లి చేసుకోండి అంటూ కాస్త ఘాటుగా బదులిస్తున్నారు. దీనికి వైసీపీ నేతలు ఫీలవుతున్నట్టున్నారు. మేం విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. హిందూ సంప్రదాయం మరచిపోయారా, అసలు పవన్ కల్యాణ్ కామెంట్లు ఏంటి అని మండిపడ్డారు.

విశాఖకు రాజధాని వద్దనే వాళ్లు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు మంత్రి బొత్స. టీడీపీ, జనసేన పార్టీలు కూడా తమ వైఖరిని మార్చుకోవాలని, వారికి ఇంకా కనువిప్పు కలగలేదని ఎద్దేవా చేశారు. విశాఖ, ఉత్తరాంధ్ర అంటే ఎందుకంత ద్వేషం అని ప్రశ్నించారు. విశాఖపై విషం కక్కొద్దని అన్నారు బొత్స. విశాఖలో ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ పెడితే ప్రతిపక్షాలకు విశాఖ ప్రజల అభిప్రాయం తెలుస్తుందన్నారు. ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిని చంద్రబాబు ఖండించాల్సింది పోయి సమర్థించడమేంటని ప్రశ్నించారు బొత్స.

గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన పవన్, ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని అన్నారు. అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్టుగా జనసేన విధానం ఉందని చెప్పారు. అసలు జనసేనకు రాజకీయ పార్టీ లక్షణమే లేదన్నారు బొత్స. జనసేన రాజకీయ పార్టీ కాదని, అది ఓ సెలబ్రిటీకి చెందిన పార్టీ అని అన్నారు.

రాజధానికి అన్నీ ఉండాలి..

రాజధానికి ఎయిర్ కనెక్టివిటీ.. సీ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ ఉండాలని అన్నారు మంత్రి బొత్స. అమరావతికి ఏ కనెక్టివిటీ ఉందని ప్రశ్నించారు. విశాఖకు కొద్దిపాటి ఖర్చు పెడితే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అమరావతికే నిధులు కేటాయించి, మేం అక్కడ కూలీలుగానే ఉండాలా అని ప్రశ్నించారు బొత్స. రాజధాని రైతులది త్యాగం కాదని, వారి సంపదని పెంచుకోవడానికి వారు చేసిన పనులను త్యాగం అనకూడదని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ థర్డ్ క్లాస్ సిటిజన్లుగానే ఉండాలా అని ప్రశ్నించారు బొత్స.

ఎవరో ఏదో చెబితే చేయడానికి తాను సినిమావాడిని కాదని అన్నారు బొత్స. తాను ప్రజాస్వామ్యబద్దంగా ఎదిగానని చెప్పారు. అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు పెడతామని చెప్పారు. తమ ప్రాంత ప్రజలు కడుపుమండి గర్జన చేశారని చెప్పారు బొత్స.

First Published:  16 Oct 2022 9:07 AM GMT
Next Story