Telugu Global
Andhra Pradesh

ఆ రైళ్ల‌లో ఏపీ ప్ర‌యాణికులు 695 మంది.. ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రానివారు 28 మంది.. - మంత్రి బొత్స

రిజర్వేషన్ చార్ట్‌ ప్రకారం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో 484 మంది, య‌శ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నట్టు మంత్రి తెలిపారు.

ఆ రైళ్ల‌లో ఏపీ ప్ర‌యాణికులు 695 మంది.. ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రానివారు 28 మంది.. - మంత్రి బొత్స
X

ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ప్ర‌యాణికుల వివ‌రాల‌ను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆదివారం వెల్ల‌డించారు. ప్ర‌మాదానికి గురైన కోర‌మండ‌ల్‌, య‌శ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ల‌లో 695 మంది ప్ర‌యాణించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఈ వివ‌రాలు మంత్రి బొత్స వెల్ల‌డించారు.

ఈ రైళ్ల‌లో ప్ర‌యాణించిన‌వారిలో 553 మంది సుర‌క్షితంగా ఉన్నార‌ని, 92 మంది అస‌లు ప్ర‌యాణాన్నే విర‌మించుకున్నార‌ని మంత్రి వివ‌రించారు. మిగిలిన‌వారిలో 28 మంది ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రాలేద‌ని చెప్పారు. ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్లు గుర్తించి వారి ఇళ్లకు అధికారులను పంపి వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. మరో 22 మంది స్వల్పంగా గాయపడ్డారని.. వారికి చికిత్స కొనసాగుతోంద‌ని మంత్రి బొత్స‌ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తర‌ఫున మంత్రి అమర్‌నాథ్, ఆరుగురు అధికారులు ఒడిశా వెళ్లి అక్కడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు. దీనిపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అందిస్తున్న‌ట్టు వివ‌రించారు.

రిజర్వేషన్ చార్ట్‌ ప్రకారం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో 484 మంది, య‌శ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నట్టు మంత్రి తెలిపారు. రిజ‌ర్వేష‌న్ లేని ప్ర‌యాణికుల వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంద‌ని చెప్పారు. ఈ సమాచారాన్ని ఒడిశాలోని వివిధ ఆస్పత్రుల నుంచి మంత్రి అమర్‌నాథ్, అధికారుల బృందం సేకరిస్తున్న‌ట్టు తెలిపారు. ఇంకా 180 మృతదేహాల వివరాలను గుర్తించాల్సి ఉంద‌ని ఒడిశా నుంచి తమకు సమాచారం వచ్చింద‌ని మంత్రి చెప్పారు.

First Published:  4 Jun 2023 9:49 AM GMT
Next Story