Telugu Global
Andhra Pradesh

పేదల పొట్టగొట్టడం ధర్మమేనా? - టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం

చంద్రబాబు అనుచరులు వలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. ఇప్పుడు లబ్ధిదారులకు పెన్షన్‌ ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు.

పేదల పొట్టగొట్టడం ధర్మమేనా?  - టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం
X

పేదలకు అందే లబ్ధితోనూ టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పింఛన్లు అందకుండా చేశారని ఆయన మండిపడ్డారు. పేదవాడి పొట్టగొట్టడం ధర్మమేనా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అనుచరులు వలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. ఇప్పుడు లబ్ధిదారులకు పెన్షన్‌ ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు వారికి బ్యాంక్‌ ఖాతాలు తెరిచి పెన్షన్‌ వేయాలంటే వీలవుతుందా అని నిలదీశారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి డీఎస్సీ పరీక్షను కూడా అడ్డుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రభుత్వం డీఎస్పీని ప్రకటించిందని గుర్తుచేశారు. అయినా.. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన సూచనలను ఫాలో అవుతామని, ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ప్రతిపక్షం తీరు ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

బీసీల ప్రాంతంలో ఓసీలకు సీటిస్తారా?

బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఓసీలకు టీడీపీ కూటమి టికెట్లు ఇచ్చిందని బొత్స విమర్శించారు. వైసీపీ మాత్రం ఉత్తరాంధ్రలో అన్ని ఎంపీ స్థానాల్లో బలహీన వర్గాలకే అవకాశం కల్పించిందని ఆయన తెలిపారు. ఒక్క వర్గం కిందనే ప్రజలంతా ఉండాలని చంద్రబాబు కోరుకుంటాడని, ఏ వర్గానికి చెందిన మేలు ఆ వర్గం వారే సాధించుకోవాలని సీఎం జగన్‌ ఆలోచన చేశారని ఆయన వివరించారు. పవన్‌కు ఇచ్చిన రెండు ఎంపీ సీట్లు కూడా బీసీకి కేటాయించలేదని ఆయన గుర్తుచేశారు. బీజేపీ కూడా అదే పంథాలో వెళ్లిందన్నారు. ఆయా పార్టీలకు ఉత్తరాంధ్ర ప్రజలపై చిన్నచూపు ఉంది కాబట్టే ఎక్కడో ఉన్న వారిని ఇక్కడ అభ్యర్థులుగా పెడుతున్నారని చెప్పారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపేశామని బీజేపీ ప్రకటన చేయాలని బొత్స డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌పై సమాధానం చెప్పకుండా వారు ఇక్కడ ప్రచారం చేయడానికి అర్హత లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రజలు తిరస్కరించడంతో ఏం జరుగుతుందోనని భయపడి బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని బొత్స చెప్పారు. చంద్రబాబు, ఆయన కుమారుడు భయపడి జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ తీసుకున్నారని, ఆ సెక్యూరిటీ కోసమే బీజేపీతో చేతులు కలిపారని మంత్రి తెలిపారు. వారు బీజేపీతో కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, ఆత్మరక్షణ కోసం మాత్రమేనని ఆయన చెప్పారు.

First Published:  31 March 2024 11:11 AM GMT
Next Story