Telugu Global
Andhra Pradesh

10 సీట్లు చాలన్నావ్‌. ఇక నువ్వు చేసేది ఏంది..?

పవన్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఈ రాష్ట్రానికి, రాజకీయాలకు అంత మంచిదన్నారు. సెలబ్రిటీ పార్టీ గురించి మాట్లాడుకోకపోతే రాజకీయ వాతావరణం కూడా బాగుంటుందన్నారు. పవన్‌ది అంతా బోగస్ ఎజెండా అని విమర్శించారు.

10 సీట్లు చాలన్నావ్‌. ఇక నువ్వు చేసేది ఏంది..?
X

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ చేతులు కలిపి వైసీపీలోని కాపు నేతలను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు రాజమండ్రిలో భేటీ అయ్యారు. కాపులకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, వాటి అమలు, వాటిని ప్రజలకు ఎలా వివరించాలి, పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలన్న దానిపై చర్చించారు. మరోసారి విజయవాడలో కాపు నేతలంతా సమావేశం కావాలని నిర్ణయించారు.

స‌మావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. పవన్‌- చంద్రబాబు కలిస్తే వైసీపీ ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. బాబు- పవన్‌ కలిసి ఉన్నారన్నది తమకు కొత్తగా తెలిసిన విషమేమీ కాదన్నారు. ఎప్పటి నుంచో తాము చెబుతున్నదేనన్నారు. తనకు 10 సీట్లు ఇవ్వండి చాలు అని పవన్ కల్యాణ్ మాట్లాడారని.. ఈ మాత్రం దానికి కాపు యువతను ఎందుకు మభ్యపెడుతున్నారని బొత్స ప్రశ్నించారు. 10 సీట్లు చాలు అని చెబుతున్నారంటే.. మిగిలిన చోట్ల సెలబ్రిటీ పార్టీని ఎవరికో తాకట్టు పెట్టేందుకు సిద్ధమైనట్టే కదా అని వ్యాఖ్యానించారు. కనీసం చిరంజీవి అయినా ధైర్యంగా ఒంటరిగా వచ్చారని.. పవన్‌కు ఆ ధైర్యం కూడా లేదన్నారు.

పవన్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఈ రాష్ట్రానికి, రాజకీయాలకు అంత మంచిదన్నారు. సెలబ్రిటీ పార్టీ గురించి మాట్లాడుకోకపోతే రాజకీయ వాతావరణం కూడా బాగుంటుందన్నారు. పవన్‌ది అంతా బోగస్ ఎజెండా అని విమర్శించారు. అసలు సెలబ్రెటీ పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ఎన్నిచోట్ల పోటీచేస్తుందో చెప్పాలన్నారు. సింగిల్‌గా పోటీకి వస్తారేమో సెలబ్రెటీ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. వైసీపీలో ఉన్న కాపు నేతలు సామాజికవర్గానికి చేసిన నష్టం, ద్రోహం ఏంటో చెప్పాలన్నారు.

కాపులంతా జనసేనతోనే ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. చంద్రబాబులాగా కమ్మవారు అంతా ఒకే పార్టీలో ఉండాలి అన్న సిద్దాంతాన్ని అనుసరించాలా అని బొత్స నిలదీశారు. సీఎం కావాలనుకుంటే 175 సీట్లలో పోటీ చేస్తా... 150 సీట్లలో గెలుస్తా అని చెప్పాలే గానీ 10 సీట్లు ఇవ్వండి చాలు అని పవన్‌ వేడుకోవడం ఏమిటని మంత్రి బొత్స ప్ర‌శ్నించారు.

First Published:  31 Oct 2022 11:40 AM GMT
Next Story