Telugu Global
Andhra Pradesh

సమ్మెలు, జీతాలపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు..

సరిగ్గా ఎన్నికల ముందు జీతాలు పెంచాలనడం సరికాదని, 4 నెలలు తర్వాత తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆలోచన చేస్తామని అన్నారు మంత్రి బొత్స. ఇప్పుడే జీతాలు పెంచాలంటే మాత్రం కుదరదని తేల్చి చెప్పారు.

సమ్మెలు, జీతాలపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు..
X

ఏపీలో ప్రస్తుతం సమ్మెల సీజన్ నడుస్తోంది. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు.. ఇలా మూడు విభాగాల వారు రోడ్లెక్కారు. ఆమధ్య వాలంటీర్లు కాస్త హడావిడి చేసినా తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఇంతమంది ఆందోళన చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం అంత కటువుగా ఎందుకు ఉంది అనే ప్రశ్న వినిపించడం సహజం. అయితే తమ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకం కాదని అంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అంగన్వాడీలయినా, మున్సిపల్ కార్మికులయినా, ఉపాధ్యాయులయినా.. తమకు అందరూ ఒకటేనన్నారు.

అన్నీ చేయాలంటే ఎలా..?

అంగన్వాడీలు 11 సమస్యలు తమ ముందు ఉంచారని.. అందులో 10 సమస్యల పరిష్కారానికి ఒప్పుకున్నామని తెలిపారు మంత్రి బొత్స. జీతాన్ని పెంచాలనే డిమాండ్ కి మాత్రం ఇప్పటికిప్పుడు అంగీకరించలేకపోయామని అన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు జీతాలు పెంచాలనడం సరికాదని, 4 నెలలు తర్వాత తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆలోచన చేస్తామని అన్నారాయన. ఇప్పుడే చేయాలంటే మాత్రం కుదరదని తేల్చి చెప్పారు బొత్స.

ఐదేళ్ల ప్రభుత్వంలో జీతాలు పెంపు గురించి ఒకసారే ప్రస్తావన ఉండాలని, రెండు మూడేళ్లకు జీతాలు పెంచాలనడం ధర్మం కాదన్నారు మంత్రి బొత్స. జీతాలు ఎంత పెంచినా సరిపోవని, మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని ఉద్యోగులను తాము కోరినట్టు చెప్పారు. ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని, కానీ చట్టం తన పని తాను చేసుకుని పోతుందని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులకు రూ.21వేలకు జీతాలు పెంచామని అన్నారు బొత్స. కమ్యూనిస్ట్ ల మాటలు విని, సమ్మెల పేరుతో ఉద్యోగులు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఇలా చేస్తే ప్రజలు క్షమించరన్నారు. వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆయా విభాగాల ఉద్యోగులకు మంత్రి బొత్స పిలుపునిచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి డిమాండ్లన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

First Published:  7 Jan 2024 4:22 PM GMT
Next Story