Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్సీ ఓటమికి నాదే బాధ్యత.. ముందస్తుపై బొత్స ఆసక్తికర సమాధానం

ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతాడని అన్నారు మంత్రి బొత్స. ఒక ఎమ్మెల్సీ సీటు ఓడిపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ ఓటమికి నాదే బాధ్యత.. ముందస్తుపై బొత్స ఆసక్తికర సమాధానం
X

ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర స్థానం ఓటమికి తనదే బాధ్యత అని ఒప్పుకున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓటమి తన ఫెయిల్యూర్ గా భావిస్తున్నానని తెలిపారు. మంత్రిగా ఉండి తానే ఎమ్మెల్సీ గెలుపు బాధ్యత తీసుకున్నానని కానీ ఓడిపోయామని చెప్పారు. ఎందుకు ఓడిపోయామనేది సమీక్షించుకుంటున్నామన్నారు. ఓటమి తప్పుని వేరేవారిపై నెట్టివేసేరకం తాను కాదని, ఆ బాధ్యతనుంచి పారిపోయే వాడిని కాదని అన్నారు బొత్స.

దానికి దీనికి సంబంధం ఏంటి..?

ఏపీ కేబినెట్ లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అనే ప్రశ్నకు బొత్స సమాధానమిచ్చారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, కేబినెట్‌ విస్తరణ ముఖ్యమంత్రి నిర్ణయం అని, ఆయనదే విచక్షణాధికారమని చెప్పారు. దానిపై మంత్రులు స్పందించడం సరికాదన్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అసంతృప్తితోనే మంత్రి వర్గంలో మార్పులు చేస్తున్నారనే వార్తల్ని ఆయన ఖండించారు. దానికి దీనికి అసలు సంబంధమే లేదన్నారు.

విశాఖపట్నం నుంచి వీలైనంత త్వరగా పాలన ప్రారంభం కావాలని, వీలైతే రేపటి నుంచే పాలనా ప్రారంభమవ్వాలనేది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు మంత్రి బొత్స. బీజేపీ నాయకులపై దాడి చేయాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఎక్కడికెళ్లినా పరిస్థితులు బట్టి మాట్లాడాలన్నారు. తమపై బురద చల్లేందుకే బీజేపీ ఆరోపణలు చేస్తోందన్నారు.

ముందస్తు వట్టిదే..

ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతాడని అన్నారు మంత్రి బొత్స. ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం తమకేముందని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్సీ సీటు ఓడిపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో సుస్థిిర ప్రభుత్వం ఉందని చెప్పారు.

First Published:  1 April 2023 9:01 AM GMT
Next Story