Telugu Global
Andhra Pradesh

అదిగో డీఎస్సీ.. ఇదిగో నోటిఫికేషన్

ఈసారయినా డీఎస్సీ విషయంలో ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందా..? డీఎస్సీలో ఉన్న మెగా అనే పదం.. ఖాళీల విషయంలో కూడా ఉంటుందా అనేది వేచి చూడాలి.

అదిగో డీఎస్సీ.. ఇదిగో నోటిఫికేషన్
X

ఫలానా పండగ తర్వాత నా కాపురం విశాఖనుంచే -సీఎం జగన్

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ -మంత్రి బొత్స

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు.. అన్నీ అమలు చేశారన్న పేరు తెచ్చుకున్న సీఎం జగన్ ఎందుకో ఈ రెండు విషయాల్లో మాత్రం డెడ్ లైన్ల మీద డెడ్ లైన్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. విశాఖ రాజధానిపై ఎప్పుడు ప్రకటన వచ్చినా జనం లైట్ తీసుకునే పరిస్థితి. ఇక డీఎస్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్వయానా విద్యాశాఖ మంత్రులు ఇచ్చిన ప్రకటనలే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మంత్రులు మారారే కానీ, ఇప్పటికింకా నోటిఫికేషన్ రాలేదు. ఆలోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డీఎస్సీ ఆశావహులంతా ఇక నోటిఫికేషన్ రాదు, రాబోదు అని ఫిక్స్ అయిన నేపథ్యంలో.. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి శుభవార్త చెప్పారు. సంక్రాంతి తర్వాత ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

డీఎస్సీ గురించి విద్యాశాఖ మంత్రి ప్రకటించారంటే కచ్చితంగా అది నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. కానీ ఇలా ఎన్నిసార్లు చెప్పుకోవాలనేదే ఇక్కడ అసలు ప్రశ్న. నోటిఫికేషన్ వచ్చే వరకు ఇది గుడ్ న్యూస్ గానే ఉంటుంది. అందుకే మంత్రి ఎన్నిసార్లు కొత్తగా చెబితే, మీడియా అన్ని సార్లు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని హెడ్డింగ్ పెట్టేస్తుంది. కానీ డీఎస్సీకోసం ఎదురుచూసేవారికి మాత్రమే ఆ గుడ్ న్యూస్ ని ఈ ఐదేళ్లలో ఎన్నిసార్లు విన్నారో స్పష్టంగా తెలుస్తుంది.

సంక్రాంతి డెడ్ లైన్ నమ్మొచ్చా..?

సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి బొత్స ఈసారి నమ్మకంగా ప్రకటించారు. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అనేది త్వరలో విడుదల చేస్తామని కూడా చెప్పారు. పండగ తర్వాత మెగా డీఎస్సీ అంటూ ఊరించారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించామని, సంక్రాంతి కానుకగా ప్రకటిస్తున్నామని చెప్పారు. మరి ఈసారయినా డీఎస్సీ విషయంలో ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందా..? డీఎస్సీలో ఉన్న మెగా అనే పదం.. ఖాళీల విషయంలో కూడా ఉంటుందా అనేది వేచి చూడాలి.

First Published:  13 Jan 2024 3:22 PM GMT
Next Story