Telugu Global
Andhra Pradesh

సమ్మె విరమించి విధుల్లోకి రండి..

మున్సిపల్ కార్మికులకు మంత్రి ఆదిమూలపు సూచన

సమ్మె విరమించి విధుల్లోకి రండి..
X

తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత కొన్నిరోజులుగా ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. కాగా మున్సిపల్ కార్మికులకు మంత్రి ఆదిమూలపు సురేశ్ కీలక సూచన చేశారు. కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధుల్లోకి చేరితే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో పర్యటించిన మంత్రి ఆదిమూలపు సురేశ్ నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల సమ్మెపై స్పందించారు. 'హైపవర్ కమిటీలో మున్సిపల్ కార్మికులకు సంబంధించి చర్చించాం. ఒకటి మినహా అన్ని డిమాండ్లు నెరవేర్చాలని నిర్ణయించాం. ఇప్పటికైనా కార్మికులు సమ్మె విడిచి విధుల్లోకి హాజరైతే ప్రభుత్వం చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. హైపవర్ కమిటీ దృష్టికి జేఏసీ సభ్యులు 23 డిమాండ్లను తీసుకొచ్చారు. ఓహెచ్‌ఏ మినహా అన్నింటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చాం.' అని మంత్రి పేర్కొన్నారు. పట్టణ పారిశుధ్య విభాగంలోని ఒప్పంద కార్మికుల వేతనం రూ.12 వేలుగా ఉండేదని, వేతనాలు తక్కువగా ఉన్నందున వారికి అదనంగా ఓహెచ్‌ఏ రూపంలో రూ.6 వేలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

పీఆర్సీ పెరిగినందున వారి వేతనాలు రూ.15 వేలకు పెరగడంతో ఆ మేరకు ఆరోగ్య భత్యాన్ని సవరించి రూ.3 వేలు కలిపి రూ.18 వేలు చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయినప్పటికీ కార్మిక సంఘం నేతలు మిగిలిన రూ.3 వేలు కూడా కలిపి మొత్తం రూ.21 వేలు వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

First Published:  14 July 2022 4:22 AM GMT
Next Story