Telugu Global
Andhra Pradesh

సంగం పూర్తిచేసింది మేమే.. టీడీపీది తప్పుడు ప్రచారం: అంబటి

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఆ రెండు బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో, ఒకవైపు కొవిడ్, మరోవైపు వరదలు వచ్చినా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించి వాటిని జాతికి అంకితం చేశారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు.

సంగం పూర్తిచేసింది మేమే.. టీడీపీది తప్పుడు ప్రచారం: అంబటి
X

సంగం బ్యారేజీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెక్కల కష్టమంటూ ఆ పార్టీ నేతలు అంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు దివంగత సీఎం వైఎస్ఆర్ శంకుస్థాపన చేస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ పూర్తి చేశారని చెప్పారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ ఆ రెండు ప్రాజెక్టులను ప్రారంభించారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సంగం బ్యారేజీ 2006లోనూ, నెల్లూరు బ్యారేజీకు 2008లోనూ వైఎస్ఆర్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 16ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయన్నారు.

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఆ రెండు బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో, ఒకవైపు కొవిడ్, మరోవైపు వరదలు వచ్చినా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించి వాటిని జాతికి అంకితం చేశారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు.

సచివాలయంలో మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తి కాకూడదని, ఏ ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాకూడదని చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా ఆరాటపడిపోతున్నాయి అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

టీడీపీ నేతలకు సిగ్గుందా?

నెల్లూరు, ఎంజీఆర్ సంగం బ్యారేజీలు చంద్రబాబు రెక్కల కష్టంతో పూర్తి చేస్తే, జగన్‌ వెళ్లి రిబ్బన్‌ కట్ చేశారంటూ టీడీపీ నాయకులు అంటున్న వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అబద్ధం చెప్పినా అతికేలా ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి అంటూ సెటైర్లు వేశారు. బ్యారేజీ పనులు అన్నీ చంద్రబాబు హయాంలో జరిగాయనడానికి, జగన్‌‌‌కి ఎలాంటి సంబంధం లేదనే మాటలు మాట్లాడటానికి రవ్వంత సిగ్గు అయినా ఉండాలి అంటూ విమర్శించారు.

సంగం బ్యారేజీ నిర్మాణానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 30.85 కోట్లు, టీడీపీ రూ. 86.01 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వం రూ.131 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక నెల్లూరు బ్యారేజీ విషయానికి వస్తే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.86.62 కోట్లు ఖర్చుపెడితే టీడీపీ రూ.71.54 కోట్లు ఖర్చు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో రూ.77.37 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు పూర్తి చేసింది అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మరి ఇది ఎవరి రెక్కల కష్టం అని టీడీపీ నేతలను నిలదీశారు.

చంద్రబాబుకు అసలు ఏ రెక్కలున్నాయి? ఆయన కష్టపడటానికి!. చంద్రబాబు రెక్కలు ఉన్న ఒక అక్కుపక్షి అని ధ్వజమెత్తారు. రాజకీయంగా ఎగిరేందుకు చంద్రబాబుకు ఎవరో ఒకరి రెక్కలు కావాలి. సీపీఐ, సీపీఎం లేకుంటే బీజేపీ రెక్కలు, పవన్‌ కల్యాణ్‌ రెక్కలు కావలి తప్ప.. సొంతంగా ఎగరలేని అక్కుపక్షి చంద్రబాబు. అయినా ఆయన రెక్కల కష్టంతో ఇవన్నీ జరిగాయని అభూత కల్పనలు, అసత్యాలు ప్రచారం చేసుకుని బతకాలనుకోవడం దురదృష్టకరం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

ప్రాజెక్టులు పూర్తి కావొద్దని కుట్ర

చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను అయినా పూర్తి చేశారా, ప్రారంభించారా? ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ను అయినా పూర్తి చేసి జాతికి అంకితం చేశారా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ సహా ఇవాళ పనులు జరుగుతున్న సాగునీటి ప్రాజెక్ట్‌లు అన్నీ కూడా ప్రారంభించింది దివంగత సీఎం వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో జగన్‌ ముందుకు వెళుతున్నారని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల ముంపు ఏర్పడుతుందంటూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలు న్యాయస్థానానికి వెళ్లాయి.

ఇరువురి వాదనలు విన్న కోర్టు ఆయా రాష్ట్రాలను కూర్చోబెట్టి మాట్లాడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తే దానిపై ఎల్లో మీడియా పోలవరం నిర్మాణం ఆగిపోతుందనే ధోరణిలో వార్తలు రాసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తి కాకూడదని, ఏ ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాకూడదని చంద్రబాబు నాయుడు ఆయనకు ఉన్న ఎల్లో మీడియా ఆరాటపడిపోతున్నాయి అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

First Published:  7 Sep 2022 11:50 AM GMT
Next Story