Telugu Global
Andhra Pradesh

కాళ్లు పట్టుకున్నా వినలేదు, అందుకే గొంతు పిసికేశా.. ?

మూడు గంటల పాటు కాళ్లు పట్టుకుంటే వినలేదని, చివరకు గొంతు పిసికి చంపేశారా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా చంపేసిన వాడిని హీరో అనాలా.. ? విలన్ అనాలా.. ? అంటున్నారు అంబటి.

కాళ్లు పట్టుకున్నా వినలేదు, అందుకే గొంతు పిసికేశా.. ?
X

అన్ స్టాపబుల్ ఎపిసోడ్ తో వెన్నుపోటు ఎపిసోడ్ ని మరుగున పడేయడానికి గట్టి ప్రయత్నం జరిగిందనే కామెంట్లు వినపడుతున్నాయి. అసలు ఆరోజు ఏం జరిగింది అనేది వివరించడానికే, ఈరోజు బావా బామ్మర్దులు గంటన్నర కష్టపడ్డారని అంటున్నారు. దీనిపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో సెటైర్లు పేలుస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో అన్ స్టాపబుల్ షో పై చెణుకులు విసిరారు.

కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు తన మాట వినమని! వినల !

గొంతు పిసికి చంపేశాడు!! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా? అంటూ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు.

మూడు గంటల పాటు గదిలో తాను ఎన్టీఆర్ ని బతిమిలాడుకున్నానని, చివరకు కాళ్లు పట్టుకుని కూడా వేడుకున్నానని, ఆయన వినలేదని, ఆ తర్వాత బయటకొచ్చి మనందరం ఓ నిర్ణయం తీసుకున్నామని అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్యతో చంద్రబాబు చెబుతారు. దీనిపై ఇప్పుడు జోకులు పేలుతున్నాయి. మూడు గంటల పాటు కాళ్లు పట్టుకుంటే వినలేదని, చివరకు గొంతు పిసికి చంపేశారా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా చంపేసిన వాడిని హీరో అనాలా.. ? విలన్ అనాలా.. ? అంటున్నారు అంబటి.

ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్..

ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా.. బాలకృష్ణ ఆహా షో సక్సెస్ అయినా, చంద్రబాబు, లోకేష్ కి వచ్చిన మైలేజీ ఏమీ లేదని అంటున్నారు వైసీపీ నేతలు. బాలయ్య "షో" సక్సెస్ ! "ఆహా" కి రేటింగ్ పెరిగింది! కానీ..చంద్రబాబు, లోకేషే పాపం.. అంటూ అంబటి మరో ట్వీట్ వేశారు. వాస్తవానికి ఈ ఎపిసోడ్ చంద్రబాబు ప్రెస్ మీట్ లా ఉంది కానీ మరోటి కాదు అనే కామెంట్లు కూడా వినపడుతున్నాయి. ఎన్టీఆర్, వైఎస్ఆర్ గురించి చెప్పిన మాటల్ని టీజర్ లా కట్ చేసి హడావిడి చేశారని, చివరకు ఆ ఎపిసోడ్ లో ఏమీ లేదని చెబుతున్నారు. బావని, అల్లుడుని పొగడటానికే బాలయ్యకు టైమ్ సరిపోయిందని చెబుతున్నారు.

ఆహాలో వచ్చిన ఎపిసోడ్ తో చంద్రబాబు కొత్తవిషయాలేవీ చెప్పకపోవడం, చెప్పుకోడానికేమీ లేకపోవడంతో వైసీపీ నేతలు సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. ఆహా ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో కూడా జోకులు బాగానే పేలుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కామెంట్లు దూసుకొస్తున్నాయి. ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు చెప్పిన ప్రతి డైలాగ్ కి కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ తో చంద్రబాబుకి రాజకీయ ప్రయోజనం ఉన్నా లేకపోయినా.. నిర్వాహకులకు మాత్రం మంచి రేటింగ్ వచ్చింది.

First Published:  15 Oct 2022 3:21 AM GMT
Next Story