Telugu Global
Andhra Pradesh

జన్మభూమి కమిటీలా.. ఇంకోసారి వద్దన్నో.. అంబటి సెటైర్

కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా మంత్రి అంబటి రాంబాబు ట్విట్ట‌ర్ వేదికగా సెటైర్ వేశారు. 'జన్మభూమి కమిటీలు మళ్లీ వద్దు. ఫ్యాను గుర్తుకే మళ్లీ మళ్లీ గుద్దు' అని ట్వీట్ చేశారు.

జన్మభూమి కమిటీలా.. ఇంకోసారి వద్దన్నో.. అంబటి సెటైర్
X

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ సభ్యులు పాలనలో, సంక్షేమ పథకాల అమల్లో వేలు పెట్టి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు కొని తెచ్చుకున్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే సామాన్య ప్రజలకు ఒక సంక్షేమ పథకం అందాలంటే.. అది జన్మభూమి కమిటీ సభ్యుల అనుమతితోనే జరిగేది. లబ్ధిదారుడు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నాడా.. లేదా.. అని నిర్ధారించుకున్న తర్వాత వారు తమకు అనుకూలంగా ఉండేవారికే మాత్రమే పథకాలు అందేలా చేసేవారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి కమిటీలు లేకుండా చేసింది. గ్రామ గ్రామానా సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా వలంటీర్లను ఎంపిక చేసి వారి ద్వారానే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇటీవల టీడీపీ నాయకులు సచివాలయ వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థను రద్దు చేసి జన్మభూమి కమిటీలను మళ్ళీ ప్రారంభిస్తామని, పార్టీ కార్యకర్తలకు ఆర్థికంగా న్యాయం చేస్తామని ఇటీవల టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా మంత్రి అంబటి రాంబాబు ట్విట్ట‌ర్ వేదికగా సెటైర్ వేశారు. 'జన్మభూమి కమిటీలు మళ్లీ వద్దు. ఫ్యాను గుర్తుకే మళ్లీ మళ్లీ గుద్దు' అని ట్వీట్ చేశారు. టీడీపీ నాయకులు పదే పదే సచివాలయ వ్యవస్థపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి జన్మభూమి కమిటీ వ్యవస్థ తిరిగి ఏర్పాటయితే సంక్షేమ పథకాలు కూడా అమలు కావని పరోక్షంగా అంబటి రాంబాబు ఈ సెటైర్ వేసినట్లు తెలుస్తోంది.



First Published:  4 Oct 2022 10:56 AM GMT
Next Story