Telugu Global
Andhra Pradesh

పవన్‌కి ఎన్ని సీట్లు ముష్టి వేస్తున్నారో చెప్పాలి

లోక కల్యాణం కోసమే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని చంద్రబాబు అంటున్నారని, జైలుకు వెళ్లొచ్చాక ఆయన మతిస్థిమితం కోల్పోయిన‌ట్టున్నార‌ని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు.

పవన్‌కి ఎన్ని సీట్లు ముష్టి వేస్తున్నారో చెప్పాలి
X

వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌కి ఎన్ని సీట్లు ముష్టి వేస్తున్నారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును ప్రశ్నించారు. తాడేపల్లిలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాబుకు పలు ప్రశ్నలు సంధించారు. బాబు, పవన్‌ గతంలో కలిసి పోటీ చేశారని, ఆ తర్వాత ఎందుకు విడిపోయారని మంత్రి ప్రశ్నించారు. మీది కలహాల కాపురం అని తేలిపోయింది.. అంటూ విమర్శించారు.

మా మార్పుల గురించి అడుగుతున్నారు సరే.. మరి చంద్రబాబు రాజకీయ అరంగేట్రం చేసిందెక్కడ..? అంటూ అంబటి ప్రశ్నించారు. చంద్రగిరిలో చిత్తుగా ఓడిపోయాక కుప్పం ఎందుకు పారిపోయారు..? మీ చిత్తూరు జిల్లాని కాదని లోకేష్‌ని మంగళగిరిలో ఎందుకు పోటీ చేయించారంటూ నిలదీశారు. బాలకృష్ణ స్వస్థలం గుడివాడ కదా.. మరి హిందూపురం ఎందుకు వెళ్లారు..? పురందేశ్వరి ఎందుకు సీట్లు మారుతున్నారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

లోక కల్యాణం కోసమే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని చంద్రబాబు అంటున్నారని, జైలుకు వెళ్లొచ్చాక ఆయన మతిస్థిమితం కోల్పోయిన‌ట్టున్నార‌ని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. 2014–19 మధ్య చేసినట్టుగానే అద్భుతంగా పనిచేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ని ఎందుకు వెంట పెట్టుకుని రావాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రగిరి, మంగళగిరి వదిలి అబ్బాకొడుకులు శంకరగిరి మాణ్యాలకు పోవాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలన చూసిన తర్వాత ఇక తనకు జీవితంలో అధికారం రాదని చంద్రబాబు ఫిక్సయ్యారని మంత్రి తెలిపారు. యువగళం ద్వారా లోకేష్‌ ఏమైనా నాయకుడయ్యాడా..? రాజకీయంగా ఏమైనా ఎదిగాడా..? యువగళం అట్టర్‌ ఫ్లాప్‌ అయింది.. అంటూ ఎద్దేవా చేశారు. అలాగే.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధినేత తనకు సీటు ఇవ్వకపోయినా పక్క చూపులు చూడననని ఆయన స్పష్టంచేశారు. జగన్‌ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని అంబటి తేల్చిచెప్పారు.

First Published:  16 Dec 2023 2:17 PM GMT
Next Story