Telugu Global
Andhra Pradesh

‘బాబు’ను ఫుల్లుగా ఏకేసిన ‘రాంబాబు’

కేంద్ర ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన చంద్రబాబే తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి దొంగ ఓట్లు కొంటూ పట్టుబడిన వ్యక్తి అని.. ఆ విషయాన్ని ప్రజలు మరచిపోలేదని మంత్రి అంబటి చెప్పారు

‘బాబు’ను ఫుల్లుగా ఏకేసిన ‘రాంబాబు’
X

ఏపీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును ఫుల్లుగా ఏకేశారు. దొంగ ఓట్ల నుంచి ఈవీఎంల వరకు అన్నింటా ఆయన అడ్డగోలుగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. అసలు చంద్రబాబు అనే వ్యక్తి కుట్రలు, కుతంత్రాలతోనే ఎదిగాడని, ప్రజాదరణతో ఎదిగిన వ్యక్తి కాదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి ఒక్క చంద్రబాబేనని మంత్రి విమర్శించారు. బాబుకు ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ నమ్మకం లేదని, క్యాష్, కుట్రలు, కుత్రంత్రాలపై మాత్రమే నమ్మకమని చెప్పారు.

దొంగతో వెళ్లి.. దొంగ ఓట్లపై ఫిర్యాదా?

కేంద్ర ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన చంద్రబాబే తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి దొంగ ఓట్లు కొంటూ పట్టుబడిన వ్యక్తి అని.. ఆ విషయాన్ని ప్రజలు మరచిపోలేదని మంత్రి అంబటి చెప్పారు. అంతేకాదు.. పార్టీ ఫిరాయింపుదారు (తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని ఉద్దేశిస్తూ)తో కలిసి వెళ్లి దొంగ ఓట్లపై ఫిర్యాదా అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి నువ్వు ఎందుకు పారిపోయి వచ్చావో మర్చిపోయావా బాబూ..? ఎమ్మెల్సీ ఎన్నికలో కోట్లు పెట్టి కొనడానికి ప్రయత్నం చేసి డైరెక్ట్‌గా పట్టుబడటం వల్లే కదా నువ్వు ఏపీ పారిపోయి వచ్చావ్‌..? అంటూ నిలదీశారు.

వాళ్లను కూడా తీసుకెళ్లాల్సింది..

వైసీపీని మోసం చేసి, డబ్బు తీసుకుని టీడీపీకి ఓటు వేసిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయడానికి వెంటబెట్టుకుని వెళ్లడం విడ్డూరంగా ఉందని అంబటి చెప్పారు. ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను కూడా వెంటబెట్టుకుని వెళితే ఆయన బండారం ఇంకా బయటపడేదని తెలిపారు. గెలిచిన ప్రతిసారీ కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే బాబు గెలిచాడని ఈ సందర్భంగా అంబటి విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా పోలింగ్‌ జరిగితే చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఐదేళ్లు చిత్తశుద్ధిగా పరిపాలన చేసిన తమ ప్రభుత్వానికి దొంగ ఓట్లతో పనేమిటని ప్రశ్నించారు. 175కి 175 స్థానాలూ గెలిచే పరిస్థితిలో తామున్నామని మంత్రి అంబటి ధీమా వ్యక్తం చేశారు.

ఓటమి భయంతోనే..

గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్ మెషీన్లు చాలా ప్రమాదకరమని చంద్రబాబు చెప్పారని, వాటివల్లే తాము ఓడిపోయామన్నారని అంబటి చెప్పారు. 2019 ఎన్నికలప్పుడు ఈవీఎంలలో సైకిల్‌కు ఓటు వేస్తే ఫ్యాన్‌కి పడిందని చెప్పారని వివరించారు. ప్రస్తుతం ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈవీఎంల గురించి ఫిర్యాదు చేయలేదేంటని ఈ సందర్భంగా అంబటి ప్రశ్నించారు. ఓటమి భయంతో చంద్రబాబు ఇలాంటి వేషాలు వేయడం కొత్తేమీ కాదన్నారు.

సైకిల్‌ గుర్తు పైనే పోటీ చెయ్‌ పవన్‌..

పవన్‌ కల్యాణ్‌ నీకు గ్లాసు గుర్తు ఎందుకు.. సైకిల్‌ గుర్తు పైనే పోటీచేయొచ్చుగా అంటూ పవన్‌పై అంబటి సెటైర్‌ వేశారు. నీ పార్టీని విలీనం చేసేయ్‌.. కావాలంటే కొంచెం ప్యాకేజీ పెంచండి అని అడిగితే బాగుంటుందని అంబటి చెప్పారు. ఎన్ని దుష్ట పన్నాగాలు పన్నినా తిరిగి రాష్ట్రంలో వైఎస్‌ జగనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలిపారు. ఇంకా మీరు సీట్లు పంచుకునే కార్యక్రమమే ప్రారంభం కాలేదు.. సీఎం జగన్‌ టీం 175+25 టీం రెడీగా ఉంది అని చెప్పారు. త్వరలో టీంను ప్రకటించబోతున్నారని తెలిపారు.

First Published:  10 Jan 2024 3:09 AM GMT
Next Story