Telugu Global
Andhra Pradesh

చిరు, పవన్, జగన్.. ఓ మర్యాదరామన్న కథ..

చిరంజీవిని జగన్ నమస్కారం పెట్టమని అడిగారా.? అని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. సీఎం జగన్ దంపతులు తనను ఎంత గౌరవించారో చిరంజీవే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.

చిరు, పవన్, జగన్.. ఓ మర్యాదరామన్న కథ..
X

"తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లాలంటే.. దానికి కిలోమీటర్ ముందే కారు దిగి నడుచుకుంటూ వెళ్లాలి, ఇలాంటి ఆధిపత్య ధోరణులు పోవాలంటే వైసీపీకి బుద్ధి చెప్పాలి." వరుసగా రెండురోజులపాటు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలివి. గతంలో సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి టీమ్ జగన్ ని కలవడానికి వచ్చినప్పుడు కూడా చాలా దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని పరోక్షంగా ఆ విషయాన్ని ప్రస్తావించారు పవన్. దీనిపై ఇప్పుడు వైసీపీ కౌంటర్లు ఇస్తోంది. చిరంజీవిని జగన్ నమస్కారం పెట్టమని అడిగారా.? అని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. సీఎం జగన్ దంపతులు తనను ఎంత గౌరవించారో చిరంజీవే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. పవన్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలో.. అల్లూరి జయంతి సభలో సీఎం జగన్, చిరంజీవి ఆలింగనం చేసుకోవడాన్ని పవన్ జీర్ణించుకోలేక పోయారని మండిపడ్డారు. అందుకే జగన్ పై లేనిపోయిని అభాండాలు వేస్తున్నారని అన్నారు. తనకు జీవితం, జీవనం చిరంజీవే అన్న విషయాన్ని పవన్ గుర్తు పెట్టుకోవాలన్నారు అమర్నాథ్.

సుంఠ.. సుంఠలు..

పవన్ కళ్యాణ్ ఒక సుంఠ అని, టీడీపీ వాళ్ళు పరమ సుంఠలు అంటూ.. కాస్త ఘాటుగానే స్పందించారు అమర్నాథ్. పవన్ కు సినిమాలపై ఉన్నంత అవగాహన రాజకీయాలపై లేదన్నారు. పవన్ కళ్యాణ్ నడుపుతున్నది కాపు జనసేన కాదని, కమ్మ జనసేన అని మరోసారి విమర్శించారు. టీడీపీ స్క్రిప్ట్, నాదెండ్ల మనోహర్ డైరెక్షన్లో జనసేన నడుస్తోందన్నారు. కార్టూన్ సినిమాలతో కాలక్షేపం చెయ్యడం పవన్ కల్యాణ్ కు అలవాటని ఎద్దేవా చేశారు. అందుకే కార్టూన్ సినిమాల్లో విలన్ పేర్లు చూసి అందరికి పెడుతున్నారని, ఆంధ్రా థానోస్ కామెంట్ పై పరోక్షంగా స్పందించారు అమర్నాథ్.

175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లు..

పవన్ కల్యాణ్ ని పదే పదే ఒకే విషయంలో వైసీపీ నేతలు ర్యాగింగ్ చేస్తున్నారు. అసలు పవన్ 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లలో పోటీ పెట్టగలరా అని నిలదీస్తున్నారు. పవన్ కి ధైర్యం ఉంటే అన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్థుల్ని నిలబెట్టాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో కాపులు తనకు ఓట్లు వేయలేదని పవన్ చెప్పుకుంటున్నారని, కాపులు ఓట్లు వేస్తే 40 సీట్లు వచ్చేవని ఆయన చెప్పడం కూడా హాస్యాస్పదం అని అన్నారు అమర్నాథ్.

First Published:  22 Aug 2022 2:30 PM GMT
Next Story