Telugu Global
Andhra Pradesh

బాలినేని విషయంలో ఆదిమూలపు రియాక్షన్ అదుర్స్

మంత్రి ఆదిమూలపు సురేష్ ఆ ఆరోపణల్ని కొట్టిపారేశారు. తప్పంతా మీడియాదేనన్నారు. తప్పుని మీడియాపైకి నెట్టేసి ఆయన తెలివిగా తప్పించుకున్నారు. బాలినేనితో తనకు పొరపొచ్చాలు లేవన్నారు.

బాలినేని విషయంలో ఆదిమూలపు రియాక్షన్ అదుర్స్
X

మాజీ మంత్రి బాలినేని నిన్న మీడియా ముందు ఏడ్చినంత పని చేశారు. తనను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారన్నారు. తనపై అధిష్టానం వద్దకు ఫిర్యాదులు మోస్తున్నారని చెప్పారు. తాను టికెట్ ఇప్పించిన మనుషులే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అంతే తప్ప ఎక్కడా ఆయన మీడియాని వేలెత్తి చూపించలేదు, మీడియా సొంతగా కట్టుకథలు ప్రసారం చేసిందని కూడా అనలేదు. పదే పదే జగన్ ప్రస్తావించే ఆ మూడు మీడియా సంస్థల పేర్లు కూడా బాలినేని తెరపైకి తేలేదు. మరి ఆ విషయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ లాజిక్కేంటో అర్థం కావడంలేదు. బాలినేని విషయంలో మీడియా సంస్థలే తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. తప్పంతా మీడియాదేనన్నారు.

ఆధిపత్యపోరు ఉందా.. లేదా..?

ప్రకాశం జిల్లా నుంచి తొలి కేబినెట్ లో ఇద్దరికి ఛాన్సిచ్చారు సీఎం జగన్, రెండోసారి అందులో ఒకర్ని తీసేశారు. అంటే రెండోవారు సమర్థులనేకదా లెక్క. దాంతో బాలినేని ఫీలయ్యారు. మంత్రి పదవి పోయినా, జిల్లాలో తన పెత్తనం కొనసాగుతుందనే హామీతో ఆయన చల్లబడ్డారు. కానీ రోజు రోజుకీ పరిస్థితులు దిగజారిపోతుండే సరికి ఆయన అలకబూనారు. ఇన్చార్జ్ పదవికి రాజీనామా చేశారు. సీఎం జగన్ బుజ్జగించకపోగా, ఆఫీస్ కి పిలిపించి మరీ నీ ఇష్టం అని తేల్చయడంతో ఇంకా ఫీలయ్యారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరీ కంటతడి పెట్టారు. ఆ కంటతడికి కారణం సొంత జిల్లాలోని సొంత పార్టీ నేతలేనని కుండబద్దలు కొట్టారు బాలినేని. కానీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆ ఆరోపణల్ని కొట్టిపారేశారు. తప్పంతా మీడియాదేనన్నారు.

ఆరోజు ఏం జరిగిందంటే..?

మార్కాపురంలో జగన్ పర్యటన సందర్భంగా బాలినేని వాహనాన్ని అడ్డుకున్న వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరోజు సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా రాకూడని దారిలో బాలినేని రావడం వల్ల ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు ఆదిమూలపు సురేష్. అంటే ఆరోజు జరిగిన తప్పులో పోలీసుల పాత్రేమీ లేదని తేల్చేశారు. ప్రస్తుతానికి అధిష్టానం బాలినేని వ్యవహారంలో గుంభనంగానే ఉన్నా.. జిల్లా మంత్రి కావడంతో ఆదిమూలపు సురేష్ కి ప్రశ్నలు తప్పలేదు, ఆయన సమాధానం చెప్పకా తప్పలేదు. అయితే తప్పుని మీడియాపైకి నెట్టేసి ఆయన తెలివిగా తప్పించుకున్నారు. బాలినేనితో తనకు పొరపొచ్చాలు లేవన్నారు.

First Published:  6 May 2023 10:43 AM GMT
Next Story