Telugu Global
Andhra Pradesh

తుపాను ప్రభావం.. 140 రైళ్లు రద్దు

తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటు రాకూడదన్నారు.

తుపాను ప్రభావం.. 140 రైళ్లు రద్దు
X

మిచౌంగ్ తుపాను ప్రభావం దక్షిణ కోస్తాపై బలంగా కనపడుతోంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కలెక్టరేట్ లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

రైళ్లు రద్దు..

మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 140కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్లలో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్3నుంచి 6వతేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.

సీఎం జగన్ సమీక్ష..

తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటు రాకూడదన్నారు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు. పునరావాస కార్యక్రమాలకు అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకోవాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అవగాహన కల్పించాలన్నారు. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటు చేయాలని, రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం జగన్.

First Published:  2 Dec 2023 3:11 PM GMT
Next Story