Telugu Global
Andhra Pradesh

టికెట్ చేజారకూడదు.. నెల్లూరులో మేకపాటి రాజకీయం

తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి భ్రష్టుపట్టి పోయారని, అందుకే జగన్ ఆయనకు టికెట్ నిరాకరించారని, కనీసం ఎమ్మెల్సీ తీసుకుని అయినా సర్దుకుపోయి ఉండాల్సిందని, టీడీపీకి ఓటువేసి శేఖర్ రెడ్డి పెద్ద తప్పు చేశారని తాజాగా తీవ్ర విమర్శలు చేశారు రాజమోహన్ రెడ్డి

టికెట్ చేజారకూడదు.. నెల్లూరులో మేకపాటి రాజకీయం
X

నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం నుంచి ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజమోహన్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే. ఇటీవలే ఆయన వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ దశలో ఇప్పుడు ఉదయగిరిలో శేఖర్ రెడ్డికి వైసీపీ ప్రత్యామ్నాయం చూస్తోంది. ఆయన స్థానంలో వైసీపీ ఇన్ చార్జ్ గా ఇద్దరు ముగ్గురు పేర్లు వినపడుతున్నాయి. అయితే ఆ స్థానం వేరేవాళ్లకు వెళ్లడం మేకపాటి కుటుంబానికి ఇష్టం లేదు. అందుకే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనా రెడ్డి పేరు వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు రాజమోహన్ రెడ్డి.

తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి భ్రష్టుపట్టి పోయారని, అందుకే జగన్ ఆయనకు టికెట్ నిరాకరించారని, కనీసం ఎమ్మెల్సీ తీసుకుని అయినా సర్దుకుపోయి ఉండాల్సిందని, టీడీపీకి ఓటువేసి శేఖర్ రెడ్డి పెద్ద తప్పు చేశారని తాజాగా తీవ్ర విమర్శలు చేశారు రాజమోహన్ రెడ్డి. అయితే అదే సమయంలో ఆయన ఉదయగిరి సీటు విషయంలో కూడా కీలక కామెంట్లు చేశారు. ఉదయగిరి సీటుకి వైసీపీ తరపున తాను రచనా రెడ్డి పేరు రికమెండ్ చేస్తానన్నారు. రచనారెడ్డి ఎవరో కాదు, చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె. తండ్రిని కోపంతో పార్టీనుంచి తరిమేసినా, ఆ కుటుంబంపై ఉన్న గౌరవంతో జగన్ ఆయన కుమార్తె రచనా రెడ్డికి అవకాశం ఇస్తారనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది.

రచనా రెడ్డి నేపథ్యం..

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనా రెడ్డి.. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి కోడలు వరుస అవుతారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి సోదరుడి కుమారుడు వంశీధర్ రెడ్డి భార్య రచనా రెడ్డి. పుట్టినిల్లు, మెట్టినిల్లు.. రెండూ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే కావడం రచనా రెడ్డికి కలిసొచ్చే అంశం. పైగా పెద్దాయన రాజమోహన్ రెడ్డి ఆశీస్సులు కూడా ఆమెకు ఉన్నాయి. అనవసరంగా తమ కుటుంబం నుంచి టికెట్ ఎందుకు బయటకు వెళ్లాలి అని ఆలోచిస్తున్నారు రాజమోహన్ రెడ్డి. అందుకే రచనా రెడ్డి పేరు తెరపైకి తెచ్చారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురి స్థానాల్లో మూడు చోట్ల ఇన్ చార్జ్ లను పెట్టిన సీఎం జగన్, ఉదయగిరి విషయంలోనే కాస్త ఆలోచిస్తున్నారు. అక్కడ తిరిగి మేకపాటి కుటుంబానికే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రచనా రెడ్డి రాజకీయ అరంగేట్రంపై ఇప్పుడు చర్చ మొదలైంది.

First Published:  7 April 2023 4:40 PM GMT
Next Story