Telugu Global
Andhra Pradesh

మళ్లీ చాకిరేవు పెట్టిన మేకపాటి.. ఈసారి అనిల్ కి కూడా

నోరు ఉందనే ఒకే ఒక్క కారణంతో అనిల్ కి జగన్ మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో నారాయణపై సింగిల్ డిజిట్ మెజార్టీతో అనిల్ గెలిచాడని అన్నారు. ఆ విషయం మరచిపోవద్దని చురకలంటించారు.

మళ్లీ చాకిరేవు పెట్టిన మేకపాటి.. ఈసారి అనిల్ కి కూడా
X

వేటుపడిన వైసీపీ ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉండటంలేదు. నేరుగా అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. విలువలు, విశ్వసనీయత అని చెప్పుకునే జగన్ తమ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశారంటూ మేకపాటి ఇదివరకే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టకముందు నుంచీ జగన్ తో కలసి ఉన్నందుకు ఇదేనా తమకిచ్చే బహుమతి అంటూ ప్రశ్నించారు. తాజాగా మరోసారి విమర్శలకు పదును పెట్టారు మేకపాటి. ఈసారి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కి కూడా కౌంటర్ ఇచ్చారు.

నెల్లూరు జిల్లానుంచి వేటుపడిన ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతారని, అలా జరక్కపోతే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానంటూ అనిల్ ఇటీవల సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆయన టార్గెట్ కోటంరెడ్డి అయినా, మేకపాటి కూడా ఆ ముగ్గురిలో ఒకరు కాబట్టి.. ఈయన కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అనిల్, ముందు తన సంగతి తాను చూసుకోవాలని, నెల్లూరు సిటీలో ఆయన ఓడిపోయే అభ్యర్థి అని అన్నారు మేకపాటి. నోరు ఉందనే ఒకే ఒక్క కారణంతోనే అనిల్ కి జగన్ మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో నారాయణపై సింగిల్ డిజిట్ మెజార్టీతో అనిల్ గెలిచాడని అన్నారు. ఆ విషయం మరచిపోవద్దని చురకలంటించారు. మమ్మల్ని పార్టీ సస్పెండ్‌ చేసింది, కానీ నీకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వదనే ప్రచారం జరుగుతోంది. ముందు నీది నువ్వు చూసుకో అంటూ మండిపడ్డారు.

వైసీపీకి ఓటమి తప్పదు..

2024లో కచ్చితంగా ప్రభుత్వం మారుతుందని, వైసీపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. నెల్లూరు జిల్లా నుంచి సస్పెండ్ అయిన ముగ్గురూ తిరిగి ఎమ్మెల్యేలుగా గెలుస్తారని, అది నూటికి నూరుపాళ్లు నిజం అని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ అడిగితే తమని సస్పెండ్ చేయడం సీఎంకు న్యాయం కాదన్నారు మేకపాటి. మమ్మల్ని సస్పెండ్ చేసి మాపైనే అట్రాసిటీ కేసులు పెట్టించాలని సజ్జల చెప్పటం ఆయన గొప్పతనం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ పై అసంతృప్తితో ఉన్నారని అన్నారు మేకపాటి.

First Published:  28 March 2023 8:45 AM GMT
Next Story