Telugu Global
Andhra Pradesh

మేకపాటి ఫ్యామిలీలో కలకలం: ఆ ఎమ్మెల్యే కొడుకుగా నన్ను గుర్తించండి

చంద్రశేఖర్ రెడ్డి కొడుకుని తానేనంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో లేఖ పోస్ట్ చేశారు. ఆయన కొడుకుగా తనను గుర్తించాలంటూ డిమాండ్ చేశారు.

మేకపాటి ఫ్యామిలీలో కలకలం: ఆ ఎమ్మెల్యే కొడుకుగా నన్ను గుర్తించండి
X

నెల్లూరు జిల్లా మేకపాటి ఫ్యామిలీలో మరో కలకలం చెలరేగింది. ఇప్పటికే సోదరులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మధ్య మాటలు లేవు. ఉదయగిరి ఎమ్మెల్యే ఇటీవల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన భార్యగా శాంతి కుమారి అనే మహిళను అందరికీ పరిచయం చేశారు. ఆమెకు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పి, తన వెంట రాజకీయ పర్యటనలకు తీసుకెళ్తున్నారు. ఈ విషయం నచ్చక రాజమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిని దూరం పెట్టారు. అయితే ఇప్పుడు మరో వ్యవహారం కలకలం రేపింది. చంద్రశేఖర్ రెడ్డి కొడుకుని తానేనంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో లేఖ పోస్ట్ చేశారు. ఆయన కొడుకుగా తనను గుర్తించాలంటూ డిమాండ్ చేశారు.







ఎవరీ శివచరణ్ రెడ్డి..?

మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు తన తండ్రి చంద్రశేఖర్ రెడ్డి అని చెబుతూ ఓ లేఖ విడుదల చేశాడు. ఇటీవల స్థానిక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రశేఖర్ రెడ్డి. తనకు మొదటి భార్యతో ఓ కుమార్తె ఉందని, ఇప్పుడు శాంతి కుమారి అనే మహిళను తాను వివాహం చేసుకున్నానని చెప్పారు. తనకు పుత్ర సంతానం లేరని అన్నారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత శివచరణ్ రెడ్డి తెరపైకి వచ్చారు. తనకు చిన్నప్పటినుంచి చదువుకి సాయం చేసి, కాలేజీ ఫీజులు కట్టి, ఇతరత్రా సాయం చేసిన చంద్రశేఖర్ రెడ్డి.. ఇప్పుడు సడన్ గా తనకు కొడుకులు లేరు అని చెప్పడం సరికాదన్నారు. రెండో భార్యగా శాంతి కుమారిని ఒప్పుకున్నప్పుడు తన తల్లికి చంద్రశేఖర్ రెడ్డి అన్యాయం చేయడం సరికాదంటున్నారు శివచరణ్ రెడ్డి.

ఇది పూర్తిగా మేకపాటి ఫ్యామిలీ వ్యవహారం అయినా, తానే ఎమ్మెల్యే కొడుకునంటూ శివచరణ్ రెడ్డి బయటకు రావడం, బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. అసలే నెల్లూరుకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు రోజుకో వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారం మళ్లీ రచ్చకెక్కింది. శివచరణ్ రెడ్డి గురించి తెలిసిన వారంతా చంద్రశేఖర్ రెడ్డితో అతనికి ఉన్న సంబంధాన్ని కాదనలేకుండా ఉన్నారు. అందుకే ఎవరూ ఆ లేఖను ఖండించలేదు. చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రస్తుతం మౌనంగా ఉన్నారు.

First Published:  7 Jan 2023 5:12 AM GMT
Next Story