Telugu Global
Andhra Pradesh

ఇక మరింత విస్తృతంగా సేవ కార్యక్రమాలు.. చిరంజీవి ప్రకటన

నా కుటుంబ సభ్యులు కూడా అత్యున్నత స్థానంలో ఉన్నారని, దేవుడు తాను అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారని పేర్కొన్నారు. సమాజానికి ఇప్పటివరకు తాను ఇచ్చింది చాలా తక్కువ అని.. మరింత తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని చిరంజీవి వెల్లడించారు

ఇక మరింత విస్తృతంగా సేవ కార్యక్రమాలు.. చిరంజీవి ప్రకటన
X

టాలీవుడ్ లో ఎన్టీఆర్ తర్వాత మూడు దశాబ్దాలకు పైగా నంబర్ వన్ స్థానంలో నిలిచిన హీరో మెగాస్టార్ చిరంజీవి. 67 ఏళ్ల వయసులో యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి సినిమాలు చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు చేయడంలోనూ ముందుంటారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరిట బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లు ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి చేతనైన సహాయం చేస్తుంటారు. కొన్నేళ్లుగా చిరంజీవి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు తాజాగా చిరంజీవి ప్రకటించారు.

కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని 'నేనొక నటుణ్ణి' అనే షాయరీకి చిరంజీవి వాయిస్ ఇచ్చారు. లక్ష్మీ భూపాల రాసిన, ఇళయరాజా స్వరపరిచిన ఆ షాయరీ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ, చిరంజీవి రంగమార్తాండ సినిమా గురించి మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇకపై మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు ప్రకటించారు. నాకేంటి?.. నా కుటుంబానికి ఏంటి?.. అనే కోణంలో ఇంతకాలం ఆలోచించానని, ఇక అది చాలు అని ఆయన అన్నారు.

నా కుటుంబ సభ్యులు కూడా అత్యున్నత స్థానంలో ఉన్నారని, దేవుడు తాను అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారని పేర్కొన్నారు. సమాజానికి ఇప్పటివరకు తాను ఇచ్చింది చాలా తక్కువ అని.. మరింత తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని చిరంజీవి వెల్లడించారు. కీర్తి, సినిమా గ్లామర్ శాశ్వతం కాదు.. వ్యక్తిత్వమే శాశ్వతం అన్నదాన్ని తాను నమ్ముతానని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య అని సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కానుంది.

First Published:  25 Dec 2022 5:55 AM GMT
Next Story