Telugu Global
Andhra Pradesh

రైలు దిగ‌బోయి.. వైద్య విద్యార్థిని మృతి

ఆమె రైలు దిగ‌బోతూ అదుపుత‌ప్పి ప‌ట్టాల‌పై ప‌డిపోయింది. అదే స‌మ‌యంలో రైలు పోర్టు రైల్వేస్టేష‌న్ వైపు నెమ్మ‌దిగా క‌ద‌ల‌డంతో కంగారుప‌డిన ఆమె స్నేహితులు వెంట‌నే రైలులోకి ఎక్కి చైన్ లాగి రైలును ఆపారు.

రైలు దిగ‌బోయి.. వైద్య విద్యార్థిని మృతి
X

కాకినాడ రైల్వేస్టేష‌న్‌లో ఘోర దుర్ఘ‌ట‌న జ‌రిగింది. రైలు దిగ‌బోయి అదుపుత‌ప్పి ఓ వైద్య విద్యార్థిని ప‌ట్టాల‌పై ప‌డి ప్రాణాలు కోల్పోయింది. గురువారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కాకినాడ జీఆర్‌పీ ఎస్ఐ ర‌వికుమార్ తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

విజ‌య‌వాడ‌కు చెందిన ఎస్‌.స‌త్య త‌నూష (24) గుంటూరు జిల్లా చిన కాకాని ఎన్ఆర్ఐ మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైన‌లియ‌ర్ చ‌దువుతోంది. ఈనెల 10వ‌ తేదీ గురువారం నుంచి కాకినాడ రంగ‌రాయ మెడిక‌ల్ కాలేజీలో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఆమె మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉద‌యం కాకినాడ‌కు చేరుకుంది.

ఈ క్ర‌మంలో ఆమె రైలు దిగ‌బోతూ అదుపుత‌ప్పి ప‌ట్టాల‌పై ప‌డిపోయింది. అదే స‌మ‌యంలో రైలు పోర్టు రైల్వేస్టేష‌న్ వైపు నెమ్మ‌దిగా క‌ద‌ల‌డంతో కంగారుప‌డిన ఆమె స్నేహితులు వెంట‌నే రైలులోకి ఎక్కి చైన్ లాగి రైలును ఆపారు. అయితే అప్ప‌టికే త‌నూష ప్లాట్‌ఫాంకి, రైలుకు మ‌ధ్య న‌లిగిపోయి, ప‌ట్టాల‌పై ప‌డి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న ఒక్క‌సారిగా ఆ ప్రాంతంలో సంచ‌ల‌నంగా మారింది. త‌మ క‌ళ్ల ముందే స్నేహితురాలు చ‌నిపోవ‌డాన్ని చూసి ఆమె స్నేహితులు గుండెల‌విసేలా రోదించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  11 Aug 2023 2:20 AM GMT
Next Story