Telugu Global
Andhra Pradesh

టీచర్ల కంటే మీడియాలో ఎక్కువ ఆవేదన

ఇక్కడే ఒక వర్గం మీడియా బాగా హర్ట్ అయినట్టుగా ఉంది. ప్రభుత్వంపైకి పనిగట్టుకుని ఇంతకాలం టీచర్లను రెచ్చగొట్టడం వెనుక ఒక లక్ష్యముంది.

టీచర్ల కంటే మీడియాలో ఎక్కువ ఆవేదన
X

జగన్‌ వచ్చాక టీచర్లపై భారం విపరీతంగా పడుతోందని కొద్దికాలంగా టీడీపీ, ఆ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా బాగా ప్రచారం చేస్తూ వచ్చాయి. బోధనేతర పనులకు వాడేస్తున్నారని విమర్శిస్తూ వచ్చారు. దాంతో జగన్‌ ప్రభుత్వం ఉపాధ్యాయులను నాన్-టీచింగ్‌ పనులకు వాడకూడదని నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ ఆమోదించింది. పనిలో పనిగా టీచర్లను ఎన్నికల విధులకు కూడా వాడకుండా ప్రభుత్వం ఓకే చెప్పేసింది.

ఇక్కడే ఒక వర్గం మీడియా బాగా హర్ట్ అయినట్టుగా ఉంది. ప్రభుత్వంపైకి పనిగట్టుకుని ఇంతకాలం టీచర్లను రెచ్చగొట్టడం వెనుక ఒక లక్ష్యముంది. ఎన్నికల విధుల్లో టీచర్లే పాల్గొంటారు కాబట్టి.. వారిని ప్రభుత్వానికి వ్యతిరేకం చేస్తూ ఎన్నికల సమయంలో వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంది అన్న ఆలోచన. ఇప్పుడావకాశం లేకుండాపోయింది. అందుకే రెండు రోజులుగా జగన్ ప్రభుత్వం దుర్బిద్ధితోనే టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతోందని ప్రచారం మొదలుపెట్టారు.

మీడియా ఎంత గందరగోళంగా ఉందంటే.. ఒకవైపు టీచర్లు నిజాయితీపరులు.. వారు ఎన్నికల విధుల్లో ఉన్నా సరే ఈవీఎం వద్దకు కూడా వెళ్లరు, అలా వెళ్లే అవకాశం కూడా ఉండదు.. కాబట్టి వారు ఏదో ఒక పక్షానికి అనుకూలంగా ప్రభావం చూపుతారన్న ప్రచారంలో వాస్తవం లేదని ఇదే మీడియా చెబుతోంది. అదే సమయంలో ఎన్నికల్లో టీచర్లు ఏదో చేస్తారనే జగన్‌ ఈ పని చేశారంటూ ప్రచారం చేస్తోంది. ఒకవేళ జగన్ సొంత ఆలోచనతోనే టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతున్నారే అనుకుందాం. వచ్చే నష్టమేంటి?. టీచర్లపై పనిభారం తగ్గించినట్టే అవుతుంది కదా!. పైగా టీడీపీ మీడియానే చెబుతోంది.. టీచర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నా వారే ఏ పక్షానికి అనుకూలంగా ఉండే పరిస్థితులే ఉండవు అని. అలాంటప్పుడు టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తే టీడీపీ మీడియాకు ఆందోళన ఎందుకన్న ప్రశ్న వస్తోంది.

ఇంకా విచిత్రం ఏమిటంటే.. నిన్నటి వరకు టీచర్లపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేసిన కొందరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు.. జగన్‌ దుర్బిద్ధితోనే ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పించారని ఆరోపించడం. ఎవరి ఉద్దేశాలు ఏమైనా.. టీచర్లకు పనిభారం తగ్గించే పనిని ప్రభుత్వం చేస్తే స్వాగతించాలి కానీ.. ఆ నిర్ణయానికి ఉద్దేశాలను ఎందుకు ఆపాదిస్తున్నట్టు. టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, మీడియా ఇంకా గగ్గోలు కొనసాగిస్తే.. ఎన్నికల పోలింగ్ సమయంలో టీచర్లు ప్రజాతీర్పును తారుమారు చేసే పని చేస్తున్నారేమోనన్న అనుమానాలకు బలాన్ని ఇచ్చి వారిపై లేనిపోని అనుమానాలను సమాజంలో రేకెత్తించడమే అవుతుంది.

First Published:  1 Dec 2022 6:18 AM GMT
Next Story