Telugu Global
Andhra Pradesh

మార్గదర్శిలో ఘోస్ట్ చందాదారులా?

సీఐడీ దర్యాప్తులో ఇలాంటి ఘోస్ట్ చందాదారులు సుమారు 3 వేల మంది ఉన్నట్లు తేల్చింది. వీళ్ళల్లో వంద మందితో నేరుగా మాట్లాడి వాళ్ళెవరూ మార్గదర్శి చందాదారులు కారని నిర్ధారణ చేసుకుంది.

మార్గదర్శిలో ఘోస్ట్ చందాదారులా?
X

తవ్వేకొద్ది మార్గదర్శి చిట్‌ఫండ్‌ అక్రమాలు, చట్ట ఉల్లంఘనలు బయటపడుతున్నాయి. తాజగా సీఐడీ ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో ఘోస్ట్ చందాదారుల గురించి వివరించారు. ఘోస్ట్ చందాదారులంటే చందాదారులకు తాము మార్గదర్శిలో చందాదారులమని తెలియనే తెలియదు. అంటే ముక్కుమొహం తెలియనివాళ్ళని, మార్గదర్శిలో అధికారికంగా చందాదారులు, కానీ వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు తదితర వివరాలను ఏదో ఒక పద్ధ‌తిలో యాజమాన్యమే సంపాదించుకుంది. అలా సంపాదించినవాళ్ళని మార్గదర్శి చందాదారులుగా తమ ఖాతా పుస్తకాల్లో చూపిస్తోంది.

అంటే వాళ్ళెవరూ చందాలు కట్టరు. చిట్టీ పాటలు పాడరు. చందాదారుల పేరుతో యాజమాన్యమే చందాలు కట్టేసి, చిట్టీ పాటలు పాడేసి ఆ మొత్తాన్ని యాజమాన్యమే తీసేసుకుంటోంది. దీనివల్ల ప్రైజ్ మనీ యాజమాన్యానికి లాభం. లేని చందాదారులను ఉన్నట్లుగా చూపించటాన్నే సీఐడీ ఘోస్ట్ చందాదారులని చెప్పింది. అదంతా బ్లాక్ మనీయే అన్నది సీఐడీ ఆరోపణ. అంటే యాజమాన్యం తన దగ్గరున్న బ్లాక్ మనీని ఘోస్ట్ చందాదారుల రూపంలో వైట్ మనీగా మార్చుకుంటోంది.

సీఐడీ దర్యాప్తులో ఇలాంటి ఘోస్ట్ చందాదారులు సుమారు 3 వేల మంది ఉన్నట్లు తేల్చింది. వీళ్ళల్లో వంద మందితో నేరుగా మాట్లాడి వాళ్ళెవరూ మార్గదర్శి చందాదారులు కారని నిర్ధారణ చేసుకుంది. అలాగే 800 మందికిపైగా కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళని కూడా గుర్తించింది. అలా డిపాజిట్లు చేసినవాళ్ళకి సరైన రసీదులు కూడా ఇవ్వలేదు. ఎవరైనా కోటి రూపాయలు డిపాజిట్ చేస్తే సరైన రసీదులు తీసుకోకుండా ఉంటారా?

మార్గదర్శిలో కోటి రూపాయల డిపాజిట్ చేసేంత ఆదాయ మార్గాలు చెప్పమని సీఐడీ అడిగినప్పుడు డిపాజిట్‌దారులు సరైన సమాధానాలు చెప్పలేదు. విజయవాడలో ఒక బిల్డర్ ఏకంగా రూ.50 కోట్లు డిపాజిట్ చేశాడు. దాంతో ఇదంతా కూడా యాజమాన్యం బ్లాక్ మనీయే అని సీఐడీ అనుమానిస్తోంది. అందుకనే ఈ విషయమై దర్యాప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం ఇచ్చింది. నరసరావుపేట, విశాఖపట్నం, విజయవాడలో బాధితులిచ్చిన ఫిర్యాదుతో మార్గదర్శి ఎండీ శైలజ మీద సీఐడీ మూడు కేసులు నమోదు చేసింది. అయితే సీఐడీ ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో చెప్పిందంతా అబద్ధాలే అని త‌న ఎల్లో మీడియాలో యాజమాన్యం వార్త రాసుకుంది.


First Published:  8 Sep 2023 4:50 AM GMT
Next Story