Telugu Global
Andhra Pradesh

ఆస్తులు జప్తు, చిట్ గ్రూపులు క్లోజ్.. మార్గదర్శి కథ కంచికి

ఏపీ, తెలంగాణలో మార్గదర్శి సంస్థకు 9,677కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. వీటిలో 1035 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రెండు దశల్లో సీఐడీ సీజ్ చేసింది. ఆస్తుల సీజ్ తో మార్గదర్శి ఇరకాటంలో పడింది.

ఆస్తులు జప్తు, చిట్ గ్రూపులు క్లోజ్.. మార్గదర్శి కథ కంచికి
X

మార్గదర్శి చిట్ ఫండ్స్ చరిత్రలో కలిసిపోయే దశకు చేరుకుంది. చిట్ ఫండ్ వ్యాపారం పేరుతో ఇన్నాళ్లూ సాగించిన అక్రమ దందాకు తెరపడే సమయం దగ్గరపడింది. పేరుకి చిట్ ఫండ్ వ్యాపారం అయినా.. అందులోని లొసుగుల్ని అడ్డు పెట్టుకుని డిపాజిట్లు సేకరించడం, ఆ డిపాజిట్లను ఇతర వ్యాపారాలకు మళ్లించడం, చిట్ సరిగా కట్టలేనివారి దగ్గర జరిమానాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడటం, మీడియాని అడ్డు పెట్టుకుని అంతా సవ్యంగానే ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడం.. ఇదీ ఇన్నాళ్లు జరిగింది. కానీ ఏపీ సీఐడీ ఈ వ్యవహారాన్నంతా బట్టబయలు చేసింది. అంతే కాదు అటు ఆస్తుల జప్తు, ఇటు చిట్ గ్రూపుల నిలిపివేతతో మార్గదర్శికి ఉక్కపోత మొదలైంది.

వెయ్యికోట్ల ఆస్తుల జప్తు..

ఏపీ, తెలంగాణలో మార్గదర్శి సంస్థకు 9,677కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. వీటిలో 1035 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రెండు దశల్లో సీఐడీ సీజ్ చేసింది. ఆస్తుల సీజ్ తో మార్గదర్శి ఇరకాటంలో పడింది. దీని ప్రభావం చిట్ ఫండ్ వ్యాపారంలో కనిపించే అవకాశముంది. అయితే పైకి గంభీరంగా కనిపిస్తున్నా.. చిట్ ఫండ్స్ నిర్వహణ ఇక మార్గదర్శికి కష్టంగా మారుతుందనేది మాత్రం స్పష్టమైంది.

23 చిట్ గ్రూపులు క్లోజ్..

నిబంధనలు ఉల్లంఘించడంతో మార్గదర్శి నిర్వహిస్తున్న 23 చిట్ గ్రూప్ లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ రద్దు చేసింది. ఈ చిట్‌ గ్రూపులు రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉన్నాయి. రద్దయిన 23 చిట్‌ గ్రూపులు సంబంధిత జిల్లాల చిట్‌ రిజిస్ట్రార్ల నియంత్రణలోకి వస్తాయి. వాటితో మార్గదర్శి కంపెనీకి సంబంధం ఉండదు. ఆ గ్రూపులను చిట్‌ రిజిస్ట్రార్లే నిర్వహిస్తారు. చందాదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఎఫ్ఐఆర్ లతో అష్ట దిగ్బంధం

మార్గదర్శి యాజమాన్యం రూ.459.98 కోట్లను మ్యూచువల్‌ ఫండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయింది. చందాదారులు కట్టిన చిట్ల సొమ్మును తమ సొంత ప్రయోజనాల కోసం మళ్లించడం, నిబంధనలకు విరుద్ధంగా ఆ సొమ్మును వేర్వేరుచోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా చందాదారులను మోసం చేసినట్లు స్పష్టమైంది. దీంతో మార్గదర్శిపై కేసులు నమోదయ్యాయి. ఆస్తుల అటాచ్ మెంట్ ఓవైపు.. ఎఫ్ఐఆర్ లు మరోవైపు.. మార్గదర్శి యాజమాన్యం అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. రామోజీరావు, శైలజా కిరణ్, ఆడిటర్ శ్రావణ్, బ్రాంచ్ మేనేజర్లపై మొత్తం 7 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్టు ఏపీ సీఐడీ తెలిపింది.

First Published:  21 Jun 2023 4:48 AM GMT
Next Story