Telugu Global
Andhra Pradesh

జగన్ ప్రశ్నకు మహానాడు జవాబు

పెరిగిన ధరలు, పన్నులు, అప్పుల భారం నాలుగేళ్లలో ఏపీలోని ఒక్కో కుటుంబానికి రూ. 7.86 లక్షలుగా తేల్చింది టీడీపీ.

జగన్ ప్రశ్నకు మహానాడు జవాబు
X

"చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే రాష్ట్రం, అదే బడ్జెట్, నేను ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే బడ్జెట్. అప్పుడు లేని నవరత్నాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పటి వరకు 2లక్షల కోట్లకు పైగా డీబీటీ ద్వారా లబ్ధిదారులకు నగదు బదిలీ చేశాను. మరి ఈ డబ్బంతా అప్పుడు ఎక్కడికి వెళ్లింది." బహిరంగ సభల్లో సీఎం జగన్ పదే పదే సంధించే సూటి ప్రశ్న ఇది. జనాలను ఒక్కసారి ఆలోచనలో పడేసే ప్రశ్న ఇది. అప్పుడు అమ్మఒడి లేదు, ఇప్పుడు ఉంది. అప్పుడు రైతు భరోసా లేదు, ఇప్పుడు ఉంది. అప్పుడు నేతన్న నేస్తం, వాహన మిత్ర, చేయూత.. లాంటివి లేవు, ఇప్పుడున్నాయి. మరి చంద్రబాబు హయాంలో ఆ డబ్బులన్నీ ఎటుపోయాయి..? ఆ ప్రశ్నకు జవాబిచ్చే దిశగా మహానాడు కసరత్తు చేసింది. మహానాడులో తొలి తీర్మానం కూడా అదే కావడం విశేషం.

పెరిగిన రేట్లు జగన్ ఖాతాలో..

బాదుడే బాదుడు మహానాడులో తొలి తీర్మానం. చంద్రబాబు హయాంలో నిత్యావసరాల రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా పెరిగాయి. వ్యత్యాసం ఎంత? కుటుంబంపై పడే భారం ఎంత..? ప్రజలు నష్టపోతున్నదెంత..? అనే లెక్కలతో ఈ తీర్మానం సిద్ధం చేశారు.

పెరిగిన ధరలు, పన్నులు, అప్పుల భారం నాలుగేళ్లలో ఏపీలోని ఒక్కో కుటుంబానికి రూ. 7.86 లక్షలుగా తేల్చింది టీడీపీ. డీబీటీ ద్వారా 2లక్షల కోట్ల రూపాయలు పేదలకు పంచి పెట్టానని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్కో కుటుంబంపై 7.86 లక్షల రూపాయల భారం మోపిందని అంటున్నారు టీడీపీ నేతలు.

చంద్రబాబు ఐదేళ్లలో రూ. 7.08 లక్షల కోట్ల బడ్జెట్ లో 3 లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారని, జగన్ నాలుగేళ్లలో రూ. 9.48 లక్షల కోట్ల బడ్జెట్ లో 2.10 లక్షల కోట్లు మాత్రమే సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారని అంటున్నారు టీడీపీ నేతలు. మొత్తమ్మీద జగన్ హయాంలో రేట్లు పెరిగాయని, కానీ సంక్షేమానికి చేస్తున్న ఖర్చు మాత్రం తగ్గిపోయిందని వివరిస్తున్నారు. నిత్యావసరాల రేట్లలో పెరుగుదలను లెక్కలు వేసి మరీ చెబుతున్నారు.

చంద్రబాబు హయాంలో రేట్లు పెరగలేదా..?

జగన్ హయాంలో రేట్లు పెరిగాయంటున్నారు సరే, మరి బాబు హయాంలో నిత్యావసరాల ధరలు అన్నీ అందుబాటులోనే ఉన్నాయా అని లాజిక్ తీస్తున్నారు వైసీపీ నేతలు. గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే కేంద్రాన్ని నిందించాల్సిందిపోయి, రాష్ట్రాన్ని తప్పుబట్టడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని 2024లో లెక్కలన్నీ తేల్చేస్తారని చెబుతున్నారు.

First Published:  27 May 2023 6:51 AM GMT
Next Story