Telugu Global
Andhra Pradesh

దసరా నిరసన.. లోకేష్ భయపడినట్టేనా..?

సోమవారం రాత్రి 7 గంటలనుంచి 7గంటల 5 నిమిషాల మధ్యలో పని పూర్తి చేయాలన్నారు. ఇంతకీ లోకేష్ ఇచ్చిన పిలుపేంటి..? ఆయనలో అంత భయమేంటి..?

దసరా నిరసన.. లోకేష్ భయపడినట్టేనా..?
X

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇటీవల కాలంలో చిత్ర విచిత్రమైన నిరసన కార్యక్రమాలతో నవ్వులపాలవుతున్న టీడీపీ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దసరా సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ తరహా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు నారా లోకేష్. సోమవారం రాత్రి 7 గంటలనుంచి 7గంటల 5 నిమిషాల మధ్యలో పని పూర్తి చేయాలన్నారు. ఇంతకీ లోకేష్ ఇచ్చిన పిలుపేంటి..? ఆయనలో అంత భయమేంటి..?

‘దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం - మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం’. ఇదీ టీడీపీ ప్రకటించిన కార్యక్రమం పేరు. సోమవారం రాత్రి టీడీపీ అభిమానులు, చంద్రబాబు మద్దతుదారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని లోకేష్ పిలుపునిచ్చారు. 5 నిమిషాల పాటు ప్రజలంతా వీధుల్లోకి వచ్చి "సైకో పోవాలి" అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయాలని, అదే ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు లోకేష్. నాలుగున్నరేళ్లుగా అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో పీడ పోవాల‌ని నిన‌దిద్దామని ఆయన ట్వీట్ చేశారు. ఇక యధావిధిగా ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవాలని, తమ నిరసనను ఉవ్వెత్తున తెలియజేయాలని సెలవిచ్చారు.


ఇదేం కామెడీ..!

నిరసన అంటే దిష్టిబొమ్మల దహనం అనేది కామన్. ఇక్కడ జగన్ పై కోపం ఉంది కాబట్టి, జగనాసుర దహనం అంటూ కాస్త ఘాటుగా టైటిల్ పెట్టుకున్నారు కాబట్టి ఆయన దిష్టిబొమ్మలు తీసుకొచ్చి రోడ్డుపై కాల్చాలని పిలుపునిస్తారేమో అని అనుకున్నారంతా. కానీ లోకేష్ మాత్రం "సైకో పోవాలి" అని రాసి ఉన్న పేపర్లను కాల్చేయండి అని పిలుపునిచ్చారు. అంటే కనీసం దిష్టిబొమ్మలు దహనం చేయండి అని చెప్పడానికి కూడా లోకేష్ భయపడ్డారా..? పోలీసులు అడ్డుకోవడం సంగతి అటుంచితే, కనీసం ఆ పిలుపునివ్వడానికి కూడా లోకేష్ ధైర్యం చేయలేదనేదే ఇక్కడ అసలు పాయింట్. పేపర్లు తగలబెట్టండి, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టండి అంటూ టీడీపీ శ్రేణులకు ఉపదేశమిచ్చారంటే, ఎక్కడో ఏదో భయం లోపల ఉందనే అనుకోవాలి. తండ్రి జైలులో ఉన్నారు, తనకి కూడా జైలు గండం ఉందనే అనుమానం లోకేష్ లో బలంగా ఉంది. పైగా ఇప్పుడు దిష్టిబొమ్మల పేరుతో రచ్చ చేస్తే కొత్త కేసు పెట్టి లోపలేస్తే.. పరిస్థితి ఏంటని ఆలోచించి ఉండొచ్చు. ఆ పిలుపిస్తే.. వైసీపి శ్రేణులనుంచి తీవ్ర వ్యతిరేక వచ్చే ప్రమాదం ఉందని ఊహించి ఉండొచ్చు. అందుకే A-4 సైజు పేపర్లో "సైకో పోవాలి" అని రాసిమరీ తగలబెట్టాలన్నారు. తద్వారా తాను కానీ, తన పార్టీ కానీ ఏం సాధిస్తుందో ఆయనకే తెలియాలి. ఈ పేపర్ల దహనంతో.. చంద్రబాబుకి ఏపాటి లాభం ఉంటుందో, అసలీ చిత్ర విచిత్ర నిరసనల విన్యాసాలు టీడీపీ ఎందుకు చేస్తోందో ఏపీ ప్రజలకు ఏమాత్రం అర్థం కావట్లేదు.

First Published:  22 Oct 2023 5:18 PM GMT
Next Story