Telugu Global
Andhra Pradesh

ఓవర్ యాక్షనే కొంపముంచుతోందా?

ఏసీబీ, సీఐడీలు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగమన్న విషయం డీజీపిని అడిగి జగన్ తెలుసుకోవాలని లోకేష్ ఎద్దేవా చేయటమే విచిత్రంగా ఉంది.

ఓవర్ యాక్షనే కొంపముంచుతోందా?
X

దాదాపు ఆరు గంటల పాటు సీఐడీ విచారణ ఫేస్ చేసిన తర్వాత కూడా లోకేష్ ఓవర్ యాక్షనే చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిని డీజీపీ దగ్గర పాఠాలు నేర్చుకోమని చెప్పండన్నారు. ఎందుకంటే చంద్రబాబు అరెస్టు తనకు తెలియ‌ద‌ని జగన్ చెప్పటమే కారణం. పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. తాను లండన్లో ఉన్నపుడు చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని చెప్పారు. అంటే చంద్రబాబు అరెస్టుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పటమే జగన్ ఉద్దేశం.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాగే చెబుతారు. అంతేకానీ చంద్రబాబును తానే అరెస్టు చేయించినట్లు జగన్ చెబుతారని లోకేష్ ఎలాగ అనుకున్నారు? చంద్రబాబు హయాంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. వాళ్ళను తామే అరెస్టు చేయించినట్లు చంద్రబాబు కానీ లేదా లోకేష్ కానీ అంగీకరించారా? అరెస్టుల ప్రస్తావన తెచ్చినపుడు తమకేమి సంబంధమనే చంద్రబాబు, లోకేష్ ఎదురు ప్రశ్నించిన విషయం అందరికీ తెలిసిందే.

వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు చెందిన ఎంతోమంది ఎంపీలు, ఎమ్మెల్యేలను సీబీఐ, ఈడీలు విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని అరెస్టులు చేస్తున్నాయి. ఏ ఒక్క అరెస్టులో అయినా తమ ఆదేశాల మేరకే వాళ్ళంతా అరెస్టయినట్లు నరేంద్ర మోడీ లేదా అమిత్ షా ప్రకటించారా? ఏ ప్రభుత్వంలో అయినా అరెస్టులు జరిగే పద్ధ‌తిదే. ఏసీబీ, సీఐడీలు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగమన్న విషయం డీజీపిని అడిగి జగన్ తెలుసుకోవాలని లోకేష్ ఎద్దేవా చేయటమే విచిత్రంగా ఉంది.

సీఐడీ, ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని జగన్‌కు ఎవరూ చెప్పాల్సిన అవసరమేలేదు. ఇంత మాత్రం తెలియ‌కుండానే ఏళ్ళ తరబడి జగన్ రాజకీయాల్లో ఉంటున్నారా? ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ కోర్టు ఏకీభవించింది. అలాగే హైకోర్టు బెయిల్ పిటీషన్ను డిస్మిస్ చేసిన కారణం కూడా ఇదే. అవినీతి జరిగిందని కోర్టులు నమ్మిన కారణంగానే చంద్రబాబుకు ఎక్కడా బెయిల్ దొరకటంలేదు. అలాంటిది అవంతా దొంగ కేసులని, అక్రమ అరెస్ట్ అని లోకేష్ వాదిస్తున్నారంటే ఓవర్ యాక్షన్ కాక మరేమిటి?


First Published:  11 Oct 2023 7:31 AM GMT
Next Story