Telugu Global
Andhra Pradesh

లోకేష్‌తో ఇదే సమస్యా?

లోకేష్ మాటల్లో విషయ పరిజ్ఞానం లేకపోయినా అహంకారం మాత్రం బాగా కనబడుతుంది. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డులో సీఐడీ విచారణ తర్వాత మీడియాతో లోకేష్ మాటల్లో ఈ విషయం స్పష్టంగా బయటపడింది.

లోకేష్‌తో ఇదే సమస్యా?
X

మొదటి నుండి నారా లోకేష్‌తో పెద్ద సమస్య ఉంది. అదేమింటటే తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటమే. తనకు ఊహ తెలిసేటప్పటికే తాత, తండ్రి ముఖ్యమంత్రులు కావటం, మేనమామ కమ్ మావగారు పెద్ద సెలబ్రిటీ కావటమే దీనికి కారణం కావచ్చు. అందుకనే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారు. లోకేష్ మాటల్లో విషయ పరిజ్ఞానం లేకపోయినా అహంకారం మాత్రం బాగా కనబడుతుంది. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డులో సీఐడీ విచారణ తర్వాత మీడియాతో లోకేష్ మాటల్లో ఈ విషయం స్పష్టంగా బయటపడింది.

ఏడు గంటల పాటు లోకేష్‌ను సీఐడీ 50 ప్రశ్నలు వేసింది. అలైన్‌మెంట్ మార్పు, లింగమనేని రమేష్‌కు లబ్ధి చేకూర్చుటం కోసమే మార్పులు చేసినట్లు ఆరోపణలు, అలైన్‌మెంట్ మార్పుల్లో మంత్రిగా లోకేష్ పాత్ర, కంతేరుకు సమీపంలోనే హెరిటేజ్ భూముల కొనుగోలు, లింగమనేని రమేష్ భూములను హెరిటేజ్ కొనుగోలుకు సంబంధించిన బోర్డు మీటింగ్ నిర్ణయం, భూముల అలైన్‌మెంట్ మార్పిడికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు వంటి అనేక ప్రశ్నలు అడిగినట్లు మీడియాలో వచ్చింది. అయితే దేనికి కూడా లోకేష్ సరిగా సమాధానం చెప్పలేదని మీడియా రాసింది.

ఇదే సమయంలో లోకేష్ మాత్రం తనను 50 ప్రశ్నలు అడిగారని అయితే అందులో 49 ప్రశ్నలు రింగు రోడ్డుకు సంబంధంలేనివే ఉన్నాయని చెప్పారు. లోకేష్ మాటలనే ఎల్లో మీడియా బాగా హైలైట్ చేసింది. గూగుల్‌ సెర్చిలో వెతికినా దొరికే ప్రశ్నలకు తనను అడిగి అనవసరంగా టైం వేస్టు చేసినట్లు చెప్పారు. అయినా సరే సీఐడీ అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. బుధవారం తనకు చాలా పనులున్నాయని చెప్పినా వినకుండా మళ్ళీ విచారణకు రావాలని అడిగితే సరే వస్తానని చెప్పానన్నారు.

తనపైన సీఐడీ తప్పుడు కేసు పెట్టిందని, తప్పు చేయలేదు కాబట్టి ఎలాంటి విచారణకైనా రెడీ అంటు సీఐడీనే చాలెంజ్ చేశారు. అన్నీ ప్రశ్నలకు తాను ఓపికగా సమాధానాలు చెప్పినందుకు సీఐడీ అధికారులు తనకు కృతజ్ఞతలు చెప్పినట్లుగా లోకేష్ చెప్పారు. మరోవైపు తాము అడిగిన‌ ఏ ప్రశ్నకూ లోకేష్ సరైన సమాధానం చెప్పలేదని సీఐడీ వర్గాల సమాచారం. గతంలో చంద్రబాబు కూడా ఇదే త‌ర‌హాలో సీఐడీనే ఎదురు ప్రశ్నించటం, రికార్డుల పరిశీలన పేరుతో టైంను వేస్టు చేసినట్లు సీఐడీ ఆరోపించింది. విచారణలో చంద్రబాబు వైఖరిని సీఐడీ కోర్టులో జడ్జీకి వీడియోలు చూపించింది. మరిప్పుడు లోకేష్ కూడా అదే పద్ధ‌తిలో వ్యవహరిస్తున్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.


First Published:  11 Oct 2023 5:51 AM GMT
Next Story