Telugu Global
Andhra Pradesh

వైసీపీ ఫుల్లు హ్యాపీ

ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చలు జరిగి బిల్లుకు అనుకూలంగా ఓట్లు పడితే ఇక రాజధానుల అంశంపై ఏ కోర్టు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు.

వైసీపీ ఫుల్లు హ్యాపీ
X

వైసీపీ నేతలు ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. కారణం ఏమిటంటే రాజధాని అంశంపై ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును చర్చించేందుకు లోక్ సభ సెక్రటేరియట్ డిసైడ్ అవ్వటమే. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుండి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు సమాచారం అందింది. చాలా కాలం క్రితం రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ విషయాన్ని ఏమిచేయాలని రాజ్యసభ సెక్రటేరియట్ న్యాయశాఖ నిపుణుల సలహాలను తీసుకున్నది.

రాజ్యసభలో చర్చకు అనుమతించవచ్చని బిల్లు ప్రతిపాదన నిబంధనల ప్రకారమే ఉందని నిపుణులు సలహాతో బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి చర్చించేందుకు సెక్రటేరియట్ అంగీకరించింది. తర్వాత ఇదే అంశాన్ని లోక్ సభ సెక్రటేరియట్ కు కూడా పంపింది. లోక్ సభలో స్పీకర్ ఓంబిర్లా కార్యాలయంలోని నిపుణులు చర్చించిన తర్వాత బిల్లుపై చర్చకు అనుమతిస్తున్నట్లు సమాచారం అందించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ తొందరలోనే చేపడతామని కూడా చెప్పింది.

అసలు బిల్లు ఉద్దేశ్యం ఏమిటంటే.. రాష్ట్ర రాజధానుల ఎంపిక విషయంలో పూర్తిస్వేచ్ఛ‌ రాష్ట్రాలకు మాత్రమే ఉండాలని విజయసాయిరెడ్డి వాదన. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలా..? లేకపోతే అవసరానికి తగ్గట్లుగా ఒకటికి మించి రాజధానులను ఏర్పాటు చేసుకోవచ్చా ..? అనే విషయమై పూర్తి స్వేచ్ఛ‌, అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలేయాలన్నది ప్రైవేటు బిల్లు ఉద్దేశ్యం. ప్రస్తుతం రాజధానిపై రాష్ట్రంలో వివాదాలను దృష్టిలో పెట్టుకునే విజయసాయిరెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారన్న విషయం తెలిసిందే.

ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చలు జరిగి బిల్లుకు అనుకూలంగా ఓట్లు పడితే ఇక రాజధానుల అంశంపై ఏ కోర్టు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. పనిలో పనిగా ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉన్న రాజధాని వివాదంపైన కూడా ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రభావం చూపే అవకాశముంది. ఒకవేళ బిల్లు చర్చకు వచ్చేలోగానే సుప్రీం కోర్టు వివాదాన్ని పరిష్కరించేస్తే సమస్యే ఉండదు. అలా కాకుండా కేసు పెండింగ్ లో ఉండగానే పార్లమెంటు గనుక బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేస్తే అప్పుడు సుప్రీం కోర్టు ఏమి చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

First Published:  22 Feb 2023 5:53 AM GMT
Next Story