Telugu Global
Andhra Pradesh

బోనులో చిక్కిన చిరుత.. నడక దారిలో పెరిగిన అప్రమత్తత

శుక్రవారం రాత్రి 10.45 గంటలకు చిరుత బోనులో చిక్కింది. దాడి జరిగిన 24 గంటల లోపు చిరుతను బంధించిన అటవీ శాఖ సిబ్బందిని అధికారులు అభినందించారు.

బోనులో చిక్కిన చిరుత.. నడక దారిలో పెరిగిన అప్రమత్తత
X

అలిపిరి నడక మార్గంలో మూడేళ్ల బాలుడు కౌశిక్ పై దాడి చేసిన చిరుత బోనులో చిక్కింది. దాడి తర్వాత 24గంటల వ్యవధిలోనే చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. అయితే చిరుత చిక్కడంతో ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. ఈ మార్గంలో చిరుతలు, ఇతర క్రూర జంతువుల సంచారం ఉంటుందని అనుమానిస్తున్నారు అధికారులు. అందుకే మరిన్ని ముందు జాగ్రత్తలకు సిద్ధమయ్యారు.



చిరుతను ఎలా బంధించారంటే..?

తిరుమల మెట్ల మార్గం ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు. 30 కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. రెండు ప్రాంతాల్లో బోనులు పెట్టారు. శుక్రవారం రాత్రి 10.45 గంటలకు చిరుత బోనులో చిక్కింది.

కొత్త మార్గదర్శకాలు..

మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లే భక్తులకు నూతన మార్గదర్శకాలు జారీ చేశారు అధికారులు. శ్రీవారి మెట్టు వద్ద ఉదయం 6నుంచి సాయంత్రం 6 వరకే అనుమతి ఉంటుంది. దీన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు. అలిపిరి వద్ద రాత్రి 10గంటల తర్వాత భక్తులను కొండపైకి అనుమతించడంలేదు. రాత్రి 7 గంటల నుంచి ఆంక్షలు మొదలవుతాయి. 7 గంటల తర్వాత అలిపిరి చేరుకునే భక్తులు 200మంది ఒక సమూహంగా ఏర్పడిన తర్వాతే వారిని మెట్ల మార్గం ద్వారా కొండ‌పైకి పంపిస్తున్నారు. ఆ 200మంది భక్తుల సమూహానికి ఒక సెక్యూరిటీ గార్డ్ తోడుగా వెళ్తారు. ప్రస్తుతానికి చిరుత చిక్కినా.. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

First Published:  24 Jun 2023 3:13 AM GMT
Next Story